ఆర్థిక సంఘం ముందూ ‘ఆవు కథ’లేనా?
సర్కారు వైఖరిని దుయ్యబట్టిన తమ్మినేని సీతారాం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాల్సిన ఈ తరుణంలోనూ సీఎం చంద్రబాబు 14వ ఆర్థిక సంఘం అధికారుల ముందూ తన పాత ‘ఆవు కథ..’నే ఎత్తుకొని రాజకీయ ఉపన్యాసాలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం నడుచుకునే ఆర్థిక సంఘం ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం బాధ్యతాయుతంగా రాష్ట్రావసరాలను విని పించి ఉండాల్సిందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సాధారణంగా రాష్ట్రంలో అక్షరాస్యత, స్థూల జాతీయోత్పత్తి, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిధులను కేటాయించడం ఆర్థిక సంఘం బాధ్యతని... అక్షరాస్యత పెరిగితే రాష్ట్రాలకు నిధులు కేటాయింపు తగ్గించే ఇప్పుడున్న నిబంధనలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మనలాంటి రాష్ట్రాలకు నిరాశకలిగించేవన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి నిబంధలనుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరి ఉండాల్సిందనీ.. దీనికితోడు రాష్ట్రంలో కేంద్రం వసూలు చేసే పన్నుల మొత్తంలో ఇప్పుడు కేటాయిస్తున్న 33 శాతం కాకుండా 50 శాతం కేటాయించాలని కోరి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు మాత్రం గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్న పాత విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు.