హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
వర్సిటీలోకి వెళ్లేందుకు రోహిత్ తల్లి, తమ్ముడి యత్నం
♦ అడ్డుకున్న హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది
♦ వర్సిటీలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన పీడీఎస్‌యూ నాయకులు
♦ అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. తోపులాట
♦ పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. భారీ సంఖ్యలో హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పీడీఎస్‌యూ కార్యకర్తలనూ నిలువరించారు. దీంతో తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద శనివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది. వర్సిటీలోకి బయటివారెవరినీ అనుమతించలేదు. గుర్తింపు కార్డులున్న విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులను మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్ వేముల తల్లి రాధిక, తన కుమారుడు రాజుతో కలసి విద్యార్థి జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు శనివారం ఉదయం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి వదలవద్దని ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు.
దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన ఆరోగ్యం బాగా లేదని, వర్సిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని రాధిక చెప్పినా.. వారు లోపలికి అనుమతించలేదు. కొంతసేపటి తర్వాత రాధిక నీరసంగా పడిపోవడంతో... హెల్త్ సెంటర్ సిబ్బంది ప్రధాన గేటు వద్దకు వచ్చి రక్త పరీక్షల కోసం నమూనాలను తీసుకున్నారు. అనంతరం వర్సిటీ అంబులెన్స్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీసీ అప్పారావు తిరిగి రావడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులను అకారణంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని రాధిక డిమాండ్ చేశారు. వీసీపై చర్యలు తీసుకునే వరకు విద్యార్థులతో కలసి పోరాటం చేస్తామన్నారు.
గేటు ఎదుట పీడీఎస్‌యూ నాయకుల బైఠాయింపు
యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయాలని.. రోహిత్ కుటుంబానికి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. వర్సిటీల్లో వివక్షను రూపుమాపాలని, రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని, పోలీసులను వర్సిటీలోకి అనుమతించరాదని డిమాండ్ చేశారు. అనంతరం వారు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ప్రధాన గేటును మూసివేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరికి భద్రతా సిబ్బంది పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు.
రోహిత్ ఉద్యమానికి రాజకీయ రంగు: గాలి వినోద్‌కుమార్
రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్ష నాయకులు వచ్చిన తర్వాత రోహిత్ వేముల ఉద్యమం రాజకీయ రంగు పులుముకొందని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. కుల వివక్ష అంతమయ్యేంతవరకూ తన ఉద్యమం ఆగదంటున్న కన్హయ్యకుమార్.. కుల నిర్మూలన కోసం ఎందుకు గళమెత్తడం లేదని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు సహా అన్ని ఉత్తరాది పార్టీలు ఐక్యమై రోహిత్ ఘటనను దృష్టి మళ్లించాయని... దేశభక్తులు, దేశద్రోహులన్న పేరుతో కన్హయ్య వైపు మరల్చాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ రోహిత్‌కు సంఘీభావం తెలిపేందుకు రెండు సార్లు హైదరాబాద్‌కు వచ్చారని... మరి కులవివక్షపై చట్టం తీసుకురావాలని పార్లమెంట్‌లో ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు.