రాహుల్ దీక్ష, ఉధృతమైన ఆందోళన
హైదరాబాద్: దళిత పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో కొనసాగుతున్న ఆందోళన శనివారం ఉధృతమైంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీక్ష చేస్తున్న నలుగురు విద్యార్థులతో ఆయన జతకలిశారు.
నేషనల్ పీపుల్ పార్టీ నేత, మాజీ లోక్‌సభ స్పీకర్ పీఏ సంగ్మా కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు. శనివారం వేముల రోహిత్ జయంతి కావడంతో ఆయన విగ్రహాన్ని హెచ్‌సీయూ ప్రాంగణంలో ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాహుల్‌గాంధీ మరోసారి హెచ్‌సీయూకు వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ తల్లి రాధికను కలిసి పరామర్శించారు.
వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ నిరాహార దీక్షకు మద్దతుగా రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ నిరశన చేపట్టనున్నారని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోజి ఎం జాన్ తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని, హెచ్‌సీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం (ఏబీవీపీ) తెలంగాణలో కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది.