వాళ్లిద్దరి మంత్రి పదవులు పీకేయండి
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల మంత్రిపదవులు పీకేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సీపీఎం కోరింది. హైదరాబాద్‌లో దళిత విద్యార్థి మరణానికి వాళ్లిద్దరే కారణమని సీపీఎం పత్రిక 'పీపుల్స్ డెమొక్రసీ'లో రాసిన సంపాదకీయంలో విమర్శించారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు బాధ్యుడైన హైదరాబాద్ యూనివర్సిటీ అప్పారావును కూడా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు దత్తాత్రేయ మీద కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.
గతంలో ఒక చిన్న ఘటన జరిగినా.. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదని, కానీ ఇప్పుడు పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ మరణం తర్వాత కూడా ఎవరూ నైతిక బాధ్యత తీసుకోవడం లేదని అన్నారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ)కు చెందిన దళిత విద్యార్థులపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, సికింద్రాబాద్ ఎంపీ అయిన దత్తాత్రేయ.. హెచ్ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాయడం వల్లే వాళ్లను సస్పెండ్ చేశారన్నారు. రోహిత్ మరణం వెనుక దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఇద్దరూ ఉన్నందువల్ల వాళ్ల మంత్రిపదవులు పీకేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.