HCU Student Suicide
-
వాళ్లిద్దరి మంత్రి పదవులు పీకేయండి
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల మంత్రిపదవులు పీకేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సీపీఎం కోరింది. హైదరాబాద్లో దళిత విద్యార్థి మరణానికి వాళ్లిద్దరే కారణమని సీపీఎం పత్రిక 'పీపుల్స్ డెమొక్రసీ'లో రాసిన సంపాదకీయంలో విమర్శించారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు బాధ్యుడైన హైదరాబాద్ యూనివర్సిటీ అప్పారావును కూడా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు దత్తాత్రేయ మీద కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. గతంలో ఒక చిన్న ఘటన జరిగినా.. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదని, కానీ ఇప్పుడు పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ మరణం తర్వాత కూడా ఎవరూ నైతిక బాధ్యత తీసుకోవడం లేదని అన్నారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ)కు చెందిన దళిత విద్యార్థులపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, సికింద్రాబాద్ ఎంపీ అయిన దత్తాత్రేయ.. హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాయడం వల్లే వాళ్లను సస్పెండ్ చేశారన్నారు. రోహిత్ మరణం వెనుక దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఇద్దరూ ఉన్నందువల్ల వాళ్ల మంత్రిపదవులు పీకేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
అప్పుడెందుకు రాలేదు?
హైదరాబాద్: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై రాజకీయం చేయడం తగదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణం కాదన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా సంబంధం లేదన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ సూసైడ్ నోట్ లో రాశాడని తెలిపారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు నాటి నుంచే హెచ్ సీయూలో వివాదం మొదలైందని చెప్పారు. మెమెన్ కు అనుకూలంగా ఫేస్ బుక్ లో కామెంట్లు పోస్ట్ చేశారని.. దీనిపై అడగడానికి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులపై రోహిత్, అతడి స్నేహితులు దాడి చేశారని చెప్పారు. ఆగస్టు 3న సుశీల్ అనే విద్యార్థిని చితకబాదారని, అతడు చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడని వెల్లడించారు. వాస్తవాలను వెల్లడించకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. -
'ఇది ఆత్మహత్య కాదు, హత్య'
-
'ఇది ఆత్మహత్య కాదు, హత్య'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి టార్గెట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను పదవులను తప్పించాలని ట్విటర్ లో పేర్కొన్నారు. 'దళితులను ఉద్ధరిస్తామని మోదీ సర్కారు గొప్పలు చెబుతోంది. మోదీ మంత్రులేమో ఐదుగురు దళిత విద్యార్థుల నోరు నొక్కి, వారిని సస్పెన్షన్ కు కారణమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కూనీ చేశార'ని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఆయనపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదైంది. Modi govt constitutionally duty bound to uplift dalits. Instead Modi ji's ministers got five dalit students ostracised n suspended(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) January 19, 2016 It's not suicide. It's murder. It's murder of democracy, social justice n equality.Modi ji shd sack ministers n aplogoize to the nation(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) January 19, 2016