అప్పుడెందుకు రాలేదు?
హైదరాబాద్: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై రాజకీయం చేయడం తగదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణం కాదన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా సంబంధం లేదన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థుల సమస్యలను రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ సూసైడ్ నోట్ లో రాశాడని తెలిపారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు నాటి నుంచే హెచ్ సీయూలో వివాదం మొదలైందని చెప్పారు. మెమెన్ కు అనుకూలంగా ఫేస్ బుక్ లో కామెంట్లు పోస్ట్ చేశారని.. దీనిపై అడగడానికి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులపై రోహిత్, అతడి స్నేహితులు దాడి చేశారని చెప్పారు. ఆగస్టు 3న సుశీల్ అనే విద్యార్థిని చితకబాదారని, అతడు చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడని వెల్లడించారు. వాస్తవాలను వెల్లడించకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు.