vemula rohit chakravarthy
-
అప్పుడెందుకు రాలేదు?
హైదరాబాద్: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై రాజకీయం చేయడం తగదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణం కాదన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా సంబంధం లేదన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ సూసైడ్ నోట్ లో రాశాడని తెలిపారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు నాటి నుంచే హెచ్ సీయూలో వివాదం మొదలైందని చెప్పారు. మెమెన్ కు అనుకూలంగా ఫేస్ బుక్ లో కామెంట్లు పోస్ట్ చేశారని.. దీనిపై అడగడానికి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులపై రోహిత్, అతడి స్నేహితులు దాడి చేశారని చెప్పారు. ఆగస్టు 3న సుశీల్ అనే విద్యార్థిని చితకబాదారని, అతడు చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడని వెల్లడించారు. వాస్తవాలను వెల్లడించకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ముగ్గురు చనిపోతే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. -
'ఇది ఆత్మహత్య కాదు, హత్య'
-
'ఇది ఆత్మహత్య కాదు, హత్య'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి టార్గెట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను పదవులను తప్పించాలని ట్విటర్ లో పేర్కొన్నారు. 'దళితులను ఉద్ధరిస్తామని మోదీ సర్కారు గొప్పలు చెబుతోంది. మోదీ మంత్రులేమో ఐదుగురు దళిత విద్యార్థుల నోరు నొక్కి, వారిని సస్పెన్షన్ కు కారణమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కూనీ చేశార'ని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఆయనపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదైంది. Modi govt constitutionally duty bound to uplift dalits. Instead Modi ji's ministers got five dalit students ostracised n suspended(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) January 19, 2016 It's not suicide. It's murder. It's murder of democracy, social justice n equality.Modi ji shd sack ministers n aplogoize to the nation(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) January 19, 2016 -
మరణంలోనే నాకు ఆనందముంది
రోహిత్ రాసిన సూసైడ్ నోట్ సారాంశం... ‘మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్యన ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు...ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండటం కంటే మరణంలోనే నాకు ఆనందముంది. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరకిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది. ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు. ఈ ప్రపంచాన్ని మొదటినుంచీ తప్పుగానే అర్థం చేసుకుంటూ వస్తున్నానేమో! ప్రస్తుతం నాలో బాధా లేదు, ప్రేమా లేదు. పూర్తి శూన్యంగా ఉన్నాను. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా చిన్ననాటి నుంచి ఒంటరితనం నుంచి నేనెప్పటికీ దూరం కాలేకపోయాను. నేను సైన్స్‌ను, ప్రకృతిని, నా చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాను. కానీ ప్రజలు ప్రకృతికి దూరమవుతున్నారు. నా మృతికి ఎవరి మాటలూ చర్యలూ కారణం కాదు. మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు తప్ప తనకు మనసుంటుందని గుర్తించడంలేదు. మనిషిని ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే చూస్తున్నారు. గాయపడకుండా ప్రేమించడం అసాధ్యంగా మారింది. మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. ఆత్మలపై, పునర్జన్మలపై నాకైతే నమ్మకంలేదు. మరణానంతరం నేను చుక్కలదాకా పయనిస్తానని, ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటానని నా నమ్మకం. నాకు ఏడు నెలల ఫెలోషిప్ రూ.1.75 లక్షలు రావాల్సి ఉంది. అందులో రూ.40 వేలు రామ్‌జీకి చెల్లించండి. మిగతాది నా కుటుంబానికి అందజేయండి. నా అంత్యక్రియలు ప్రశాంతంగా, సాఫీగా జరిగిపోనీండి. నా కోసం ఎవరూ ఏడవొద్దు. నన్నెంతగానో ప్రేమించిన ఏఎస్ఏ సంఘం సభ్యులు వారిని బాధపెడుతున్నందుకు నన్ను క్షమించాలి. తన గదిని ఉపయోగించుకున్నందుకు ఉమ అన్న క్షమించాలి’.