మరణంలోనే నాకు ఆనందముంది | vemula rohit chakravarthy suicide note | Sakshi

మరణంలోనే నాకు ఆనందముంది

Published Tue, Jan 19 2016 9:07 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

సస్పెన్షన్ తరువాత అంబేడ్కర్ చిత్ర పటంతో హాస్టల్ ఖాళీ చేసి వెళ్తున్న రోహిత్ (ఫైల్) - Sakshi

సస్పెన్షన్ తరువాత అంబేడ్కర్ చిత్ర పటంతో హాస్టల్ ఖాళీ చేసి వెళ్తున్న రోహిత్ (ఫైల్)

మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్యన ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను.

రోహిత్ రాసిన సూసైడ్ నోట్ సారాంశం...
 
‘మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్యన ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు...ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండటం కంటే మరణంలోనే నాకు ఆనందముంది. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరకిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది.

ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు. ఈ ప్రపంచాన్ని మొదటినుంచీ తప్పుగానే అర్థం చేసుకుంటూ వస్తున్నానేమో! ప్రస్తుతం నాలో బాధా లేదు, ప్రేమా లేదు. పూర్తి శూన్యంగా ఉన్నాను. ఇది చాలా దారుణమైన స్థితి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా చిన్ననాటి నుంచి ఒంటరితనం నుంచి నేనెప్పటికీ దూరం కాలేకపోయాను. నేను సైన్స్‌ను, ప్రకృతిని, నా చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించాను. కానీ ప్రజలు ప్రకృతికి దూరమవుతున్నారు. నా మృతికి ఎవరి మాటలూ చర్యలూ కారణం కాదు. మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు తప్ప తనకు మనసుంటుందని గుర్తించడంలేదు. మనిషిని ఒక ఓటుగా, అంకెగా, వస్తువుగానే చూస్తున్నారు. గాయపడకుండా ప్రేమించడం అసాధ్యంగా మారింది.

మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. ఆత్మలపై, పునర్జన్మలపై నాకైతే నమ్మకంలేదు. మరణానంతరం నేను చుక్కలదాకా పయనిస్తానని, ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటానని నా నమ్మకం. నాకు ఏడు నెలల ఫెలోషిప్ రూ.1.75 లక్షలు రావాల్సి ఉంది. అందులో రూ.40 వేలు రామ్‌జీకి చెల్లించండి. మిగతాది నా కుటుంబానికి అందజేయండి. నా అంత్యక్రియలు ప్రశాంతంగా, సాఫీగా జరిగిపోనీండి. నా కోసం ఎవరూ ఏడవొద్దు. నన్నెంతగానో ప్రేమించిన ఏఎస్‌ఏ సంఘం సభ్యులు వారిని బాధపెడుతున్నందుకు నన్ను క్షమించాలి. తన గదిని ఉపయోగించుకున్నందుకు ఉమ అన్న క్షమించాలి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement