
'రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు చెల్లించాలి'
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించాలని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లో విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ... హెచ్ సీ యూ వీసీ పి. అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రోహిత్ కులంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది.
ఈ సందర్భంగా రోహిత్కు గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి జేఏసీ మీడియాకు విడుదల చేసింది. రోహిత్కు వ్యతిరేకంగా బీజేపీ, ఏబీవీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. రోహిత్ అంత్యక్రియలను హడావిడిగా జరపడం వెనుక కుట్ర దాగి ఉందని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది.