సిద్ధు ఘాటు వ్యాఖ్యలు
బెంగళూరు: 'శవాలతో రాజకీయం చేయొద్దు. ఇలాంటి రాజకీయాల పట్ల మాకు నమ్మకం లేద'ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి కేజే జార్జి రాజీనామా అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో స్వచ్ఛందంగా మంత్రి పదవికి జార్జి రాజీనామా చేశారని చెప్పారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదైనా ఎందుకు రాజీనామా చేయించలేదని బీజేపీని ప్రశ్నించారు.
'మాథుర వైద్యుడి మృతి కేసులో స్మృతి ఇరానీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమెకు మంత్రిగా కొనసాగే హక్కు ఉందా? నరేంద్ర మోదీ కొత్తగా తీసుకున్న 19 మంత్రుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. దీనిపై బీజేపీ పార్టీ నోరు మెదపదు. జార్జి రాజీనామా చేయాలని మాత్రం డిమాండ్ చేస్తుంద'ని సిద్ధరామయ్య మండిపడ్డారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేశాయని వాపోయారు.