ఐటీ తనిఖీలు చేసుకోవచ్చు: సీఎం
సాక్షి, బెంగళూరు: ‘అబద్ధపు ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులు తనిఖీలు చేసుకోనివ్వండి, ఆ తర్వాత చూద్దామ’ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. ఆర్‌టీఐ కార్యకర్త రామమూర్తి సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై గవర్నర్‌తో పాటు ఐటీ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించారు. ‘ఈ ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు, ఫిర్యాదులకు నేను భయపడబోను. ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం కూడా లేద’ ని పేర్కొన్నారు.
బీజేపీ తలపెట్టిన ‘మంగళూరు చలో’ కార్యక్రమంపై స్పందిస్తూ.. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని సిద్ధరామయ్య అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డాక్టర్ డీకె శివకుమార్, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.