ముందస్తు ఎన్నికల్లేవు: సీఎం
మైసూరు: రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఏ చెరువులను కూడా డినోటిఫికేషన్ చేయాలన్న ప్రతిపాదన లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తెలిపారు. మైసూరు నగరంలో లలిత మహాల్ హెలిప్యాడ్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగవని సీఎం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీతో పాటు ఇక్కడా ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో మాత్రమే జరుగుతాయని, త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదని, అధికారం నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
డీనోటిఫైపై తప్పుడు ప్రచారం
ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న చెరువులను డీనోటిఫై చేస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న చెరువుల డీనోటిఫై పై మంత్రిమండలిలో చర్చ జరిగిందని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బస్టాండు గతంలో చెరువుగా ఉండేది. అనేక మురికివాడలు కూడా చెరువులుగా ఉండేవన్నారు. అయితే రెవెన్యూ శాఖ రికార్డుల్లో ఇప్పటికీ కూడా ఈ స్థలం చెరువు అని ఉందని, దానిని మార్చాలని సూచించడం జరిగింది తప్ప డీనోటిఫై చేయాలని తాము చెప్పలేదన్నారు.
ఐటీ దాడులకు బెదరం
బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులను వెతికి పట్టుకుని మరీ ఐటీ దాడులు చేయిస్తున్నారని, ఎన్ని దాడులు చేసినా తాము భయపడేది లేదని చెప్పారు. లింగాయతలకు ప్రత్యేక మతం విషయంలో తనపై ఆరోపణల తగదని, ఒక వర్గాన్ని కూలదోయడం బీజేపీ నాయకులు చేసే పని అని ఆరోపించారు.