హడావుడిగా ఢిల్లీకి సీఎం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు పూనుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మొరపెట్టుకోనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం హడావుడిగా ఢిల్లీకి చేరుకున్నారు.
కేబినెట్ విస్తరణ తరువాత కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు పరమేశ్వర్ ముఖం చాటేస్తున్నారు. ఏవేవో కారణాలను పరమేశ్వర్ చెబుతున్నప్పటికీ, ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఐకమత్యంగా ఎదుర్కొనలేక పోతే ఓటమి పాలవుతామన్న విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేసేందుకే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పయనమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆదివారం సోనియాగాంధీని కలిసి పరమేశ్వర్ విషయంలో జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య కోరనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా మేడంకి నివేదిక ఇవ్వనున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గౌరి లంకేష్ హత్య ఉదంతం పై సోనియాగాంధీ నివేదిక కోరడం తెలిసిందే. ఈ పరిణామాలను కూడా సిద్ధరామయ్య, సోనియాగాంధీకి వివరించనున్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.