రోహిత్ దళితుడు కాదు..!
రోహిత్ దళితుడు కాదు..!
Published Wed, Aug 24 2016 8:32 PM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM
-ఏకసభ్య కమిషన్ నిర్ధారణ
-అప్పారావు నిర్దోషి అంటూ కితాబు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ దళితుడు కాదని, కాబట్టి అక్కడ వివక్షకి ఆస్కారం లేదంటూ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఆగస్టు మొదటి వారంలో తన నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది.
గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన వైస్ ఛాన్సలర్ పొదలి అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్‌లపై విద్యార్థులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైన నేపధ్యంలో రోహిత్ కులం పై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు బిజెపి చర్చ లేవనెత్తాయి. రోహిత్ దళితుడు కాదని తేల్చే ప్రయత్నం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అశోక్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది.
అయితే ఈ కమిషన్ యూనివర్సిటీ లో వివక్ష జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, బిజెపి మంత్రులను కాపాడే లక్ష్యంతో ఈ రిపోర్టు తయారయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ దళితుడు కాదని, కనుక వివక్షకి తావులేదని, అలాగే వీసీ పొదిలె అప్పారావుకి రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదని, అతను నిర్దోషి అంటూ కితాబివ్వడం గమనార్హం.
ఈ విషయమై రోహిత్ తల్లి రాధిక స్పందిస్తూ ‘‘నేను ఎస్‌సి మాల అని, నా కొడుకు కూడా అదే కులానికి చెందిన వాడని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ లు చెప్పారు. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నా కొడుకు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారిస్తారు’’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి బిజెపి మంత్రులను కాపాడేందుకేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసునించి మంత్రులను, తమ అనుచరులను తప్పించేందుకు బిజెపి కుట్రగా దీన్ని అభివర్ణించారు.
రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి వేముల సాక్షితో మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఎదుట తమ గోడు వినిపించే అవకాశం కూడా రూపన్వల్ ఇవ్వలేదని, అలాగే కులం గురించి ఒక్క ప్రశ్నకూడా తన తల్లి రాధికని గానీ, తనను గానీ అడగలేదని, అలాంటిది రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారణకు వస్తారన్నారు. ఏకసభ్య కమిషన్, విచారణ సందర్భంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని, తాము చెప్పేదేదీ వినకుండా ‘‘అవన్నీ మాకు తెలుసు, కొత్త విషయాలు చెప్పండి’’ అంటూ తమ వాదాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కమిషన్ ఇవ్వలేదని రాజా తెలిపారు. నిజానికి రోహిత్ ఆత్మహత్యకు కారణమే వివక్ష అయినప్పుడు వివక్ష గురించి చెపుతుంటే చెప్పనివ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తమకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా పూర్తి రిపోర్టు బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు.
Advertisement
Advertisement