రోహిత్ వేముల దళితుడే: పునియా
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిన కమిషన్... అతడిది ఏ కులం అనే దానిపై నివేదిక ఇవ్వడం దురదృష్టకరమన్నారు. రోహిత్ దళితుడేనని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ నిర్థారించారని, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్న విషయాన్ని పునియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏకసభ్య కమిషన్ వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది.
వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది.