హెచ్‌సీయూకు 27 వరకు సెలవులు
హైదరాబాద్: వైస్ చాన్స్లర్ అప్పారావు రాకతో ఒక్కసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ మొదలైన ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం ఆంక్షలను కఠిన తరం చేసింది. యూనివర్సిటీకి ఈనెల 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నేతలకు సైతం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని యూనివర్సిటీ యాజమాన్యం పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. యూనివర్సిటీ మెయిన్ గేట్ను మాత్రమే తెరచి కేవలం యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నామని యాజమాన్యం వెల్లడించింది.
మరోవైపు హెచ్‌సీయూలో కన్హయ్యకుమార్ సభ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నిస్తుండగా.. అసలు కన్హయ్యకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఉందా లేద అనే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు పోలీసుల నుంచి కన్హయ్యకు ఎలాంటి అనుమతి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ వరకు రావడం మాట అటుంచి, అసలు హైదరాబాద్‌లోనైనా అతడిని అడుగు పెట్టనిస్తారా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మంగళవారం వీసీ నివాసంపై దాడికి పాల్పడిన 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, రోహిత్ తల్లి నేడు హెచ్సీయూలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హెచ్సీయూలో పరిస్థితి టెన్షన్ టెన్షన్గా మారింది.