కులాన్ని తేల్చాల్సింది రూపన్వాల్ కాదు | Rohith Vemula suicide: Roopanwal commission submits report | Sakshi
Sakshi News home page

కులాన్ని తేల్చాల్సింది రూపన్వాల్ కాదు

Published Sat, Oct 8 2016 3:01 AM | Last Updated on Fri, Jul 26 2019 5:38 PM

కులాన్ని తేల్చాల్సింది రూపన్వాల్ కాదు - Sakshi

కులాన్ని తేల్చాల్సింది రూపన్వాల్ కాదు

మా కులం ప్రస్తావించాల్సిన అవసరం కమిషన్‌కు ఏమొచ్చింది?
మండిపడిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా

 సాక్షి, హైదరాబాద్: ‘‘రోహిత్ కులం ఏదో తేల్చాల్సింది జస్టిస్ రూపన్వాల్ కాదు. రూపన్వాల్ ఏనాడూ మేం నివసించిన పరిసరాలను సందర్శించిన పాపాన పో లేదు. మా కుటుంబ సభ్యులతో కానీ, మా చుట్టుపక్కలవారితో కానీ మాట్లాడనైనా మాట్లాడని రూపన్వాల్.. ఏ ఆధారాలతో మేము దళితులం కాదని నిర్ధారించారో చెప్పాలి’’ అని ఆత్మహత్యకు పాల్పడిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ దళితుడు కాదంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు జస్టిస్ రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై శుక్రవారం ఆమె మండిపడ్డారు.

రోహిత్ ఆత్మహత్య అనంతరం విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కమిషన్ వేసినట్టే వేసి.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రూపొందించిన నివేదికను రూపన్వాల్ ద్వారా బయటపెట్టారన్నారు. అసలు కమిషన్‌ను ఎందుకు నియమించారో ఆ పని చేయకుండా తమ కులం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇదంతా నిందితులను కాపాడేందుకు చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. దళిత కులంలో పుట్టి, వివక్షను అనుభవించి, అష్టకష్టాలు పడి బిడ్డలను పెంచిన తనను వదిలేసి తన భర్త కులాన్ని తనకు అంటగట్టాలని చూడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

మా వాదన వినిపించుకోలేదు...రోహిత్ సోదరుడు రాజాచక్రవర్తి స్పందిస్తూ.. తన అన్నయ్య రోహిత్ మరణానికి సంబంధించి కమిషన్ ముందు తాము హాజరైన వెంటనే న్యాయమూర్తిగారు తమతో మాట్లాడిన తొలి విషయం ‘నాకు ఫ్లైట్‌కి టైం అయిపోతోంది. ఏదైనా చెప్పాలనుకుంటే జల్దీ చెప్పండి’ అని మాత్రమే అన్నారు. తాము రోహిత్‌కు యూనివర్సిటీలో ఎదురైన వివక్ష గురించి చెప్పబోతే.. తమను మాట్లాడనివ్వకుండా ‘అవన్నీ మేం పత్రికల్లో చదివాం.. టీవీల్లో చూశాం. అది కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పమని’ తమను తొందరపెట్టారన్నారు.

తాము చెప్పిందేదీ ఆయన వినిపించుకోలేదన్నా రు. గుంటూరు జిల్లా అధికారులు, తహసీల్దారు, కలెక్టరు సైతం తాము దళితులమేనని పదేపదే స్పష్టం చేశారని గుర్తుచేశారు. తమ అమ్మమ్మ వాంగ్మూలాన్ని, అలాగే తమ తండ్రి నాన్నగారైన తమ తాత య్య వెంకటేశ్వరరావు కూడా తమ తల్లి రాధిక ఎస్‌సీ మాల అని స్పష్టం చేశాక కూడా ఇదే విషయం ఎందుకు చర్చిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తేల్చాల్సింది తమ కులం గురించి కాదని, రోహిత్ మరణానికి కారణాలేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement