రూపన్వాల్ నివేదికను తిరస్కరించాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్యపై రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన అబద్ధాల నివేదికను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్ద్వందంగా తిరస్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోహిత్ తల్లిపై మోపిన అభియోగాలు నేరపూరితంగా ఉన్నాయని, ఆమెను అవమానపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం అన్యాయమని అన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి రోహిత్ మాల కులస్తుడేనని నిర్ధారించారని, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా రోహిత్ దళితుడేనని స్పష్టం చేశారని.. అందుకు భిన్నంగా కమిషన్ నివేదికివ్వడం అభ్యంతరకరమన్నారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, హెచ్‌సీయూ ప్రమేయం లేదని కమిషన్ తేల్చడం వెనక వారిని కాపాడటమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.