ప్రజాస్వామిక సంస్కృతిని కాపాడుకుందాం!
రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినపుడు ఏదైతే జరుగుతుందని ఊహించామో, భయపడ్డామో, ఆందోళన చెందామో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలపట్ల ప్రభుత్వాలకు, వాటి అండ గల శక్తుల్లో అసహనం తారస్థాయికి చేరింది. భిన్నాభిప్రాయాలు కలిగిన వారిపై వారు చేస్తున్న బౌద్ధిక, భౌతిక దాడులకు లెక్కే లేదు. యూనివర్సిటీల నుంచి ఉడీ దాకా ‘దేశభక్తి’ పేరిట తమను వ్యతిరేకించిన అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గోర క్షణ నెపంతో రాజకీయాలు నడుపుతున్నారు. మతం, జాతీయత, దేశభక్తి పదాలతో వారు ప్రజలను మానసికంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నందువల్ల సరిహద్దుల్లోనే కాదు దేశంలోనూ యుద్ధోన్మాద విద్వేష ప్రచారం నాట్యం చేస్తోంది. మనం ఆందోళన చెందవల సింది ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న ప్రమాదాన్నే.
ఈ ప్రయత్నాలు జరగడం లేదని కాదు. అన్యాయమైన ఆరో పణలు ఎదుర్కొని రోహిత్ వేముల మరణించినప్పుడు హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెల్లుబికిన విద్యార్థి ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి అన్యాయమైన జీవో ఒకటి జారీచేసి పంట పొలాల స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నప్పుడు మల్లన్నసాగర్ రైతులు చేసిన ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. ఢిల్లీలోని జేఎన్ యూలోను, గుజరాత్‌లోని ఉనాలోను, చాలాకాలంగా కశ్మీర్ లోను, ఛత్తీస్‌గఢ్‌లోను జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా అప్ర జాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలే. బాలగోపాల్ ఏడో వర్ధంతి సందర్భంగా అలాంటి కొన్ని ఆందోళనలలో పాల్గొన్న వ్యక్తులను వక్తలుగా ఆహ్వానించాం.
జూలై 8న బుర్హాన్ వాని (22) ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ ఎంతగా రగిలిపోయిందో గత 3 నెలలుగా చూస్తూనే ఉన్నాం. 60 రోజుల కర్ఫ్యూ, 88 మంది మృతి, పెల్లెట్ గాయాలకు వందల మంది కంటిచూపు కోల్పోవడం.. ఇంత జరిగినా భారత రాజ్యా నికి, పౌర సమాజానికి కశ్మీర్ భూభాగం తప్ప మనుషులు కనబ డటం లేదు. ప్రజా ఆకాంక్షల మేరకే సరిహద్దులు ఏర్పడాలి, సమసిపోవాలి అని మాట్లాడటమే రాజ ద్రోహమై కూర్చుంది. కశ్మీర్‌ను ఎప్పటికీ సరిహద్దు తగాదాగానే చూద్దామా? అదొక నెత్తురోడుతున్న గాయంలా మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిని చెప్పేందుకు ఈ సభకు రావాల్సిన జేకేసీసీఎస్ నాయకుడు ఖుర్రం పర్వేజ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన స్థానంలో అదే సంస్థకు చెందిన జమీర్ అహ్మద్ కశ్మీర్ పరిస్థితి మీద మాట్లాడనున్నారు.
ఇతరులను జాతిద్రోహులని ముద్రలు వేసే ఈ ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మటుకు ‘బైట’ రాష్ట్రాల మేధావులను తరిమికొట్టి, రాజపక్సే ఫార్ములాను అమలు పరచాలని చూస్తున్నాయి. ‘బైట’ రాష్ట్రాల న్యాయవా దులు అక్కడ వాదించకూ డదు. ‘బైట’ రాష్ట్రాల విలేక రులు అక్కడ ఉండి వార్తలు రాయకూడదు. పోలీసులు స్థాపించిన ‘అగ్ని’ సంస్థ మావో యిస్టులకు వ్యతిరేకంగా ‘లల్కార్’ యాత్రలు తీస్తుంది కాని సోని సోరిని మట్టుకు తిరంగా యాత్ర తీయనీయదు. దుర్గ-మహి షాసురుని కథపై తమకే గుత్త ఉన్నట్లు.. దానికి వేరే భాష్యం చెప్పిన వామపక్ష ఆదివాసీ ఉద్యమ కారుడు మనిష్ కుంజంపై కేసు పెట్టింది. కల్లోల ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో మనిష్ కుంజం మనతో పంచుకోనున్నారు.
విశ్వవిద్యాలయాల్లో ఆలోచనలకు పహారా కాస్తున్నారు. విద్యార్థులెవరూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడకూడదు. ముజఫర్‌నగర్ గురించి, అక్కడి సహాయక శిబిరాల్లో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడకూడదు. అఖ్లాక్ హత్యపై అసలే మాట్లాడ కూడదు. మాట్లాడితే రోహిత్ వేములను నెట్టినట్లే మృత్యువు నోట్లోకి నెడతారు. ఒక చేతిలో బాబాసాహెబ్ పటాన్ని, మరో చేతిలో పక్కబట్టలను పట్టుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ రోహిత్ తారలను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. రోహిత్ నమ్మకా లను పంచుకున్న మనం రాధిక గారి కడుపుకోతను చూసి బాధప డుతున్నాం కానీ వీసీ అప్పారావు దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒక్కరికీ తప్పు చేసామన్న అపరాధ భావం లేదు.
ఆదివాసీలపై, పేదవారిపై, స్త్రీలపై, ప్రతి అణగారిన వర్గంపై జరుగుతున్న జులుంకి వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ అంటున్న జేఎన్‌యూ ఉద్యమ విశేషాలను (బసొ) కార్యకర్త అయిన జేఎన్ యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ వివరించనున్నారు. ప్రేమ, బాధ, జీవితం, మృత్యువు వంటి విషయాలలో సైతం మహా మొరటుగా వ్యవహరించే కుల వ్యవస్థ విషపరిష్వంగంలో కూరుకుపోయిన విశ్వవిద్యాలయాలను సంస్కరించాల్సింది ఎలాగో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం చెబుతారు.
హిందుత్వవాదం మన మెదళ్లకు చుడుతున్న ఉరితాళ్లన్నిటినీ తెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఊపిరి సలపడం లేదు. బాల గోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా అందరం కలుద్దాం. విందాం. పరిస్థితులు మెరుగవుతాయో ఆలోచిద్దాం. అందరూ రండి. బాలగోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరుగనుంది. బాలగోపాల్ రాసిన నాలుగు పుస్తకాలు కూడా ఈ సభలో ఆవిష్కృతమవుతాయి. బాల గోపాల్ తెలుగు ఉపన్యాసాల డీవీడీ, సీడీని కూడా నేడు విడుదల చేయడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.
- వీఎస్ కృష్ణ,
మానవహక్కుల వేదిక 94404 11899