
రాజ్యసభను కుదిపేసిన రోహిత్ ఆత్మహత్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది.
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. ఈరోజు రాజ్యసభ ప్రారంభం కాగానే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ అంశాన్ని లేవనెత్తారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని ఆమె అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థులను అణచివేస్తున్నారని మాయావతి ఆరోపించారు.
సెంట్రల్ వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తికి కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. దళిత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం సమాధానం చెప్పాలని ఆమె పట్టుబట్టారు.
దీనిపై కొంతసేపు సభలో గందరగోళం జరిగింది. తర్వాత అధికార పక్షం కూడా చర్చకు తాము తక్షణం సిద్ధమని చెప్పడంతో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చర్చకు అనుమతించారు. కానీ, మాయావతి మాత్రం చర్చ విషయాన్ని పట్టించుకోకుండా.. ప్రభుత్వం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వదని అడిగారు. చర్చ జరిగితే.. ఆ తర్వాత ప్రభుత్వం దానికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని కురియన్ చెప్పినా.. మాయావతి, ఆమె పార్టీ సభ్యులు వినిపించుకోలేదు. బీఎస్పీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళం రేగడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అటు లోక్ సభలోనూ రోహిత్ ఆత్మహత్యపై చర్చకు విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే, ఈ అంశంతో పాటు జేఎన్‌యూ వివాదంపై చాలా నోటీసులు వచ్చాయని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అన్నింటిపైనా కలిపి సమగ్ర చర్చ ఈరోజే చేపడదామని స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. దాంతో అక్కడ ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.