’మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా’
- మాయావతి హెచ్చరిక, రాజ్యసభ నుంచి వాకౌట్
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోరోజు సమావేశమైన రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారత్-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని లేవనెత్తారు. ఆమె మాట్లాడుతుండగా సభాపతి అడ్డుపడటంతో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
’మాట్లాడేందుకు అనుమతించకపోతే.. నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వకపోతే.. నేను రాజీనామా సమర్పించి వెళ్లిపోతాను’ అంటూ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజీనామా చేయాలని మాయావతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మాయావతి సభాపతిని సవాల్ చేసి అగౌరవపరిచారని, ఆమె క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు.