మాయావతి రాజీనామా వ్యూహం ఇదిగో!
న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి రాజ్యసభకు రాజీనామా చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఆమె వ్యూహం ఏమిటీ? ఉద్దేశం ఏమిటీ? రాజీనామా అస్త్రం ద్వారా ఆమె వ్యూహంగానీ, ఉద్దేశంగానీ ఫలిస్తుందా? ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో దళితులపై జరిగిన దాడుల గురించి తనను మాట్లాడకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ ఆమె రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను బుధవారం నాడు ఆమోదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న మాయావతి పార్టీకి 2012 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస దెబ్బలు తగులుతున్నాయి.
ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 70 సీట్లురాగా, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాలేదు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లు లభించాయి. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. దళితులు తన నుంచి దూరం అవుతున్నారు. ‘భీమ్ ఆర్మీ’ లాంటి కొత్త దళిత వేదికలు పుట్టుకొస్తున్నాయి. భీమ్ ఆర్మీ బీజేపీ పునాదులపై ఏర్పడిదంటూ ఆరోపించడం వల్ల దళితులు దూరం అవుతున్నారే తప్ప దగ్గరవడం లేదు.
మళ్లీ దళితులను దగ్గర చేర్చుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ అంబేడ్కర్ పేరిట ‘ఆత్మగౌరవం, ప్రతిష్ట’ ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం ఒకేఒక్క అంబేడ్కర్ పేరుతో ముందుకు రావడం వల్ల ఈ ప్రచారం పట్ల దళితులకు కాస్త ఆసక్తి కల్పించినప్పటికీ మీడియా ప్రచారానికి మాత్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె సరిగ్గా 12 రోజుల క్రితం, అంటే జూలై 8వ తేదీన లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆత్మగౌరవ ప్రచారా కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆమె మంగళవారం నాడు రాజ్యసభలో యూపీలో దళితులపై జరగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నప్పుడు అధికారపక్షం సభ్యులు అడ్డుపడ్డారు. త్వరగా ముగించాల్సిందిగా సభాపతి కూడా కోరారు. అందుకు నిరసనగా ఆమె సభ నుంచి వాకౌట్‌చేసి అనంతరం సభాపతికి రాజీనామా లేఖను అందజేశారు.
‘దళితులపై కొనసాగుతున్న దాడుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు పాలకపక్ష సభ్యులు నన్ను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుపడ్డారు. సభలో మాట్లాడే అర్హత నాకు దక్కనప్పుడు సభలో కొనసాగే నైతిక అర్హత కూడా నాకు లేదు’ అంటూ మాయావతి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు రాజీనామాకు వ్యక్తిగత కారణాలు మినహా ఎలాంటి ఇతరేతర కారణాలు చూపకూడదు. అలా చేసినట్లయితే రాజీనామాలను సభాపతులు తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాయావతి రాజీనామాను తిరస్కరించకుండా బుధవారం ఆమోదించారు. అయినా దీనివల్ల ఆమెకు కలిగే నష్టం పెద్దగా ఏమీలేదు. ఎందుకంటే ఎలాగు ఆమె రాజ్యసభ సభ్యత్వం మరో తొమ్మిది నెలల్లో ముగిసిపోతుంది కనుక.