ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్న అంశం రాజ్యసభలో పెను దుమారాన్ని రేకెత్తించింది. అఖిలేష్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు గట్టిగా డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందన్న అంశం రాజ్యసభలో పెను దుమారాన్ని రేకెత్తించింది. అక్కడి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి పారేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సహా పలువురు గట్టిగా డిమాండ్ చేశారు. ఇది సమాజ్ వాదీ, బీఎస్పీ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభలో 14 మంది సభ్యులున్న బీఎస్పీ.. బదయూలో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం, హత్య సంఘటన విషయమై మంగళవారం నాటి సభలో ఒక్కసారిగా మండిపడింది.
సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే పార్టీ అధినేత్రి మాయావతి ఎదురుదాడి ప్రారంభించారు. బదయూ లోక్సభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సమీప బంధువు ధర్మేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యూపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని, అఖిలేష్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలన్న తన హామీని కూడా ముఖ్యమంత్రి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో బీఎస్పీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి యూపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజ్వాదీ సభ్యులు కూడా వారితోపాటు వెల్లోకి వెళ్లడంతో ఛైర్మన్ అన్సారీ సభను పది నిమిషాల పాటు వాయిదావేశారు. తిరిగి సమావేశమయ్యాక బీఎస్పీ ఎంపీలు వాకౌట్ చేయడంతో సభ సజావుగా సాగింది.