సాక్షి, న్యూఢిల్లీ : మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఘట్‌బంధన్ విఫలమై విడిపోవడానికి కూడా అనన్ని కారణాలు ఉన్నాయి.
1. మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు తమను తాము అధిక అంచనా వేసుకున్నారు. తమ పిలుపుమేరకు ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఓటే వేస్తారని భావించారు. ఆ అంచనాలు తప్పాయి. పైగా కేంద్రంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ అభ్యర్థినవుతానని మాయావతి కలలుకనగా, అఖేలేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చక్రం తిప్పొచ్చని భ్రమపడ్డారు.
2. యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ కార్యకర్తల ఓట్లు మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకీ పడ్డాయి. అందుకే ఆమె పార్టీకి 10 సీట్లు వచ్చాయి. బీఎస్పీ సీట్లు ఎస్సీకి పడలేదు. అందుకే ఐదు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమికి 42.85 శాతం ఓట్లు వచ్చాయి. అవే ఓట్లు ఈసారి వచ్చినట్లయితే ఈ కూటమికి 41 నుంచి 43 సీట్లు రావాలి. ఈసారి ఓట్లు 38.92 శాతం ఓట్లు మాత్రమే రావడంతో కూటమి 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
3. బీఎస్పీ, ఎస్పీ కార్యకర్తలు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించినా క్షేత్రస్థాయిలో వారు నిజంగా కలిసిపోలేదు. అందుకు యాదవులు, దళితుల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైషమ్యాలే కారణం. భూమి కోసం వీరి మధ్య వైరుధ్యాలు కొనసాగడమే కాకుండా సాంస్కతికంగా కూడా వీరు పడదు.
4. దళితులు బీజేపీకే ఓటు వేశారు. ఎస్పీ అభ్యర్థి పోటీ చేసిన చోటల్లా ఎక్కువ మంది దళితులు బీజేపీకి ఓటు వేశారు.
5. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా కూటమి ఓటమికి కారణమయ్యారు. ఆయన బీజేపీ మద్దతుతో ఈ ఎన్నికల్లో ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేశారు.
6. ఫలితాల అనంతరం మాయావతి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫలితాలపై సమీక్ష జరిపారు. ఒంటరిగా వెళ్లి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నాయకులు సూచించారు. అందుకు ముందు ప్రయోగాత్మకంగా రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి చూడాలని నిర్ణయానికి వచ్చారు. ఘట్‌బంధన్‌తో తాత్కాలికంగా తెగతెంపులు చేసుకుంటున్నామని ఆమె మీడియా ముఖంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment