బీజేపీ నేత వ్యాఖ్యలపై పెనుదుమారం!
న్యూఢిల్లీ: బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిని ఉద్దేశించి బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ బరితెగింపు వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మాయావతిని వేశ్యతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభను కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మూకుమ్మడిగా అధికార బీజేపీని నిలదీశారు. మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రతిపక్షాలు హెచ్చరించాయి.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. ఈ విషయంలో మాయావతికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆమె బాధను తాము కూడా పంచుకుంటామని అన్నారు. బీజేపీ నేత దయాశంకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా డిమాండ్ చేశారు.
మాయావతి రాజ్యసభలో మాట్లాడుతూ ఈ విషయంలో తనకు అండగా నిలిచిన అరుణ్ జైట్లీ, ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నడూ ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ భావజాలాల పరంగానే ఎవరిపైనైనా విమర్శలు చేశానని ఆమె పేర్కొన్నారు. గుజరాత్‌లో దళితులపై అరాచకాల పట్ల రాజ్యసభలో చర్చిస్తున్న సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆమె విమర్శించారు. తనను అందరూ బెహెన్ జీ (అక్కయ్య) అని పిలుస్తారని, తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారం కలిగించిందని ఆమె అన్నారు. ఈ అంశంపై దుమారం నేపథ్యంలో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు యూపీ బీజేపీ చీఫ్ కూడా తమ పార్టీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.