Dayashankar singh
-
‘ఆమె చెబితేనే ఆందోళనలు చేశాం’
లక్నో: బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళనలు చేయించారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు దయాశంకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశామని చెప్పారు.‘మహరాణి(మాయావతి) ఆదేశాల మేరకే అప్పుడు ఆందోళన చేశామ’ని శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాశంకర్ మైనర్ కుమార్తె, భార్య స్వాతిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సిద్ధిఖీపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఈరోజు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. గతేడాది జూలైలో మాయావతిపై దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా బీఎస్పీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. దయాశంకర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 21న హజ్రత్‌గంజ్‌లో సిద్దిఖీ సహా బీఎస్పీ సీనియర్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దయాశంకర్ కుమార్తెకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దయాశంకర్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఆయన భార్య స్వాతి సింగ్ ఎమ్మెల్యేగా గెలిచి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే దయాశంకర్ కుమార్తెపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కావాలంటే వీడియో క్లిప్పింగులు చూసుకోవచ్చని సిద్ధిఖీ అన్నారు. -
భార్య గెలిచింది.. మాఫీ చేసేశారు
మళ్లీ బీజేపీలోకి దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత మొరట వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద నేత దయాశంకర్ సింగ్ తప్పును బీజేపీ మాఫీ చేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ.. మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే.. బీజేపీ ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ గతంలో దయాశంకర్‌సింగ్ హేయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటు లోపలా.. బయటా తీవ్ర దుమారం రేగింది. బీజేపీ సహా అన్ని పార్టీలను ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దళిత నాయకురాలిని ఉద్దేశించి ఇలా మొరటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది. దయాశంకర్‌పై బీజేపీ బహిష్కరణ వేటు వేసినప్పటికీ ఆయన భార్యకు కీలక పదవి అప్పగించింది. ఆమెను యూపీ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది. అంతేకాకుండా ఆమె తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే దయాశంకర్‌పై విధించిన సస్పెన్షన్ వేటును బీజేపీ యూపీ చీఫ్ కేవశ్ప్రసాద్ మౌర్య ఎత్తివేశారు. యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తనను తిరిగి పార్టలోకి తీసుకోవడంపై దయాశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. -
'నా భార్య, కూతురు అనారోగ్యంతో ఉన్నారు'
మవు: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీజేపీ బహిష్కృత నాయకుడు దయాశంకర్ సింగ్ ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. మవు జిల్లా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆయనకు పూల దండలు వేసి మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఎస్సీ/ఎస్టీ కోర్టు అదనపు జిల్లా జడ్జి అజయ్ కుమార్ శనివారం బెయిల్ మంజూరు చేశారు. తన భార్య, కుమార్తె ఆరోగ్యం బాలేదని, నేరుగా లక్నోకు వెళుతున్నట్టు దయాశంకర్ తెలిపారు. తన కుటుంబ సభ్యులను కలుసుకుంటానని చెప్పారు. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్ల సమర్పించడంతో ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. సింగ్ పై జూలై 20న కేసు నమోదు కాగా, 29న బిహార్ లో యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, మవు జైలుకు తరలించారు. -
దయాశంకర్‌కు బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌కు బెయిల్ మంజూరైంది. పూచీకత్తుగా 50 వేల రూపాయల విలువైన బాండ్లు రెండు సమర్పించాల్సిందిగా కోర్టు ఆయన్ను ఆదేశించింది. శనివారం మవు జిల్లా సెషన్స్ జడ్జి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న దయాశంకర్.. మాయావతి పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపిస్తూ ఆమెను వేశ్యతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ దయాశంకర్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించింది. ఆజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన్ను యూపీ పోలీసులు గత నెల 29న బిహార్‌లో అరెస్ట్ చేశారు. -
పోలీసులకు చిక్కకుండా ఫొటోలకు పోజులు
లక్నో: ఓ పక్క బూట్లు అరిగేలా పోలీసులు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ జాడ కోసం గాలింపులు జరుపుతుండగా ఆయన మాత్రం దర్జాగా ఫొటోలకు పోజులిస్తున్నారు. జార్ఖండ్ లో ఓ ఆలయం వద్ద మొక్కులు చెల్లిస్తూ ఉన్న ఫొటోలు బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో కొందరు బీజేపీ నేతలతో కలిసి ఆయన దర్జాగా నవ్వుకుంటూ పూజలు చేస్తూ కనిపించడం గమనార్హం. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దళితుల ఓట్లు కొల్లగొట్టాలని వ్యూహం రచించగా దయాశంకర్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని తీవ్ర పదజాలంతో దూషించి అబాసు పాలైన విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలతో బీజేపీకి తీరని నష్టం జరిగింది. దీంతో ఆ పార్టీ అతడిని బహిష్కరించి ఆరేళ్లు దూరం పెట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన దయాశంకర్ ను వెంటనే అరెస్టు చేయాలని ముక్తకంఠంతో దళితులు నినదించిన నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. కానీ, అతడు మాత్రం వారికి చిక్కడం లేదు. కేసు నమోదై వారం గడుస్తున్నా ఆయన మాత్రం ఇలా పోలీసుల కళ్లు గప్పి ఏం చక్కా చక్కెర్లు గొడుతున్నారు. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోల కారణంగా మరోసారి దళితులు ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. -
'నన్ను క్షమించు అక్కా..!'
లక్నో: మరోసారి బీఎస్పీ అధినేత్రి మాయావతికి క్షమాపణలు చెబుతున్నట్లు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ చెప్పారు. అయితే, తన ఆరోపణలు మాత్రం వాస్తవం అని అన్నారు. ఆమె ముమ్మాటికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు అమ్ముకున్నారని చెప్తానని అన్నారు. ఎందుకంటే అదే నిజం అని చెప్పారు. ఆదివారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 'మాయావతి సోదరిలాంటిది. ఆమె విషయంలో నేను అన్నమాటలు ముమ్మాటికి చాలా తప్పుడుమాటలే. అయితే, అన్ని వేళలా నేను అలా మాట్లాడను. కానీ, ఆరోజు అన్న మాటల్ని మొత్తానికి ఆపాధించి తప్పుగా మీడియా వ్యాఖ్యానించింది. ఆమెను అలా అన్నందుకు ఆ వెంటనే క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. కానీ, ఆమె ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లను ఇచ్చిందనేది వాస్తవం' అని ఆమె అన్నారు. -
'నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు'
-
'నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు'
లక్నో: బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆరోపించారు. తమ 12 ఏళ్ల కుమార్తెను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేయడంతో దయాశంకర్ కు వ్యతిరేకంగా బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనలు, ప్రకటనలు చేశారు. బీఎస్పీ మద్దతు చేసిన ప్రకటనలు అభ్యంతకరంగా ఉన్నాయని స్వాతి సింగ్ అన్నారు. 'వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నా భర్తపై కేసు నమోదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయినా మాయావతి సంతృప్తి చెందలేదు. మమ్మల్ని బయటకు ఈడ్చాలని బీఎస్పీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో నా కుమార్తె చాలా బాధ పడింది. బీఎస్పీ నేతలు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను ఎందుకు ఖండించరు? అలాంటి వారిని పార్టీ నుంచి ఎందుకు తొలగించరు? నా భర్త నాలుక కోసి తెస్తే రూ.50 లక్షలు ఇస్తామని ఒకావిడ ప్రకటించింది. బలహీన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీ నేతలు ఇలాగేనా ప్రవర్తించేది? నన్ను, నా కుమార్తెను మానసికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేయాల'ని స్వాతి సింగ్ డిమాండ్ చేశారు. -
'అతడి నాలుక కోస్తే 50 లక్షలు ఇస్తా'
ఛండీగడ్: మాయవతిపై మొరటు వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై ఉచ్చు బిగుస్తోంది. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి ఆయన కష్టాలు కొనితెచ్చుకున్నారు. బీజేపీ ఆయనను ఆరేళ్ల పాటు బహిష్కరించింది. దయాశంకర్ పై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురువారం పోలీసులు ఉత్తరప్రదేశ్ లో పలుచోట్ల సోదాలు జరిపారు. మరోవైపు తమ అధినేత్రిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దయాశంకర్ నాలుక కోసి తెచ్చిన వారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ ప్రకటించారు. కాగా, దయాశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు చర్యలు తీసుకున్నామని, ఈ వివాదం ముగిసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. -
BSP కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తం
-
మాయవతిపై మొరటు వ్యాఖ్యలు
♦ ఆమె తీరు వేశ్యకంటే ఘోరమన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ♦ దయాశంకర్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం ♦ పార్టీలకతీతంగా ఆయన వ్యాఖ్యలను ఖండించిన నేతలు ♦ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ♦ కమలనాథులపై విరుచుకుపడిన మాయావతి ♦ ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరిక ♦ దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ ♦ నోరు జారా.. క్షమించండి.. మాయవతి అంటే నాకు గౌరవం ఉంది: దయాశంకర్ కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం - దయాశంకర్‌సింగ్ దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయి. - మాయావతి న్యూఢిల్లీ/మావు: ‘‘కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం’’అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్.. బీఎస్పీ అధినేత్రి, మూడు సార్లు ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయవతిని ఉద్దేశించి సభ్యసమాజం తలదించుకునేలా చేసిన దారుణ వ్యాఖ్యలివీ. ఓ దళిత నాయకురాలిని ఉద్దేశించి చేసిన ఈ హేయమైన వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలా.. వెలుపలా ప్రకంపనలు సృష్టిం చాయి. ఒక మహిళా నాయకురాలిని, ఓ పార్టీ అధినేతను పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీలకతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో ఖండించారు. దయాశంకర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ మాయావతి ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ పరిణామాలతో ఇరకాటంలో పడిన బీజేపీ.. తక్షణం దయాశంకర్‌ను పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నిబంధనల ప్రకారం ఆయనపై నిషేధం ఆరేళ్లపాటు ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దళితులకు దగ్గరయ్యేందుకు బీజేపీ విఫలయత్నం చేస్తోంది. ఇటువంటి సమయంలో దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. రాజ్యసభలో దుమారం.. బీజేపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మంగళవారం తొలిసారి మావుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాయావతిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బుధవారం రాజ్యసభలో దుమారం రేగింది. గుజరాత్లో దళితులపై అరాచకాల అంశంలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ అంశం సభ ముందుకొచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని లెవనెత్తారు. గౌరవనీయ మహిళా నాయకురాలు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతిపై ఇటువంటి వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. డీఎంకే నాయకురాలు కనిమొళి, టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రయాన్, కాంగ్రెస్ సభ్యులు కుమారి షెల్జా, రేణుకాచౌదరి, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రా తదితరులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు క్షమార్షం కానివని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సభ్యులతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. సభా నాయకుడు అరుణ్‌జైట్లీ స్పందిస్తూ.. దయాశంకర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని, ఈ అంశంలో మాయావతికి తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. జైట్లీ హామీతో శాంతించని మాయావతి.. దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. తనను అంతా బెహెన్జీ (సోదరి)గా భావిస్తారని, అటువంటి తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన కుమార్తె, సోదరికి కూడా వర్తిస్తాయని ధ్వజమెత్తారు. దేశంలో దోపిడీకి, అణచివేతకు గురవుతున్న ప్రజలకు తాను ప్రాతిని ధ్యం వహిస్తున్నానని, వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు. కాన్షీరాం ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెట్టుబడిదారుల నుంచి కాక పేదల నుంచే తాము విరాళాలు స్వీకరిస్తున్నామని వివరించారు. నోరు జారా.. క్షమించండి.. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పాటు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడంతో దయాశంకర్‌సింగ్ క్షమాపణలు చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చి అగ్రనేతగా ఎదిగిన మాయావతి అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఈ విషయంలో తాను నోరు జారానని పేర్కొన్నారు. అయితే దయాశంకర్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. అటువంటి భాషకు పార్టీలో స్థానం లేదని, ప్రసంగాలు ఇచ్చే సమయంలో నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కోర్టుకీడుస్తాం: బీఎస్పీ ఎంపీ ఎస్సీ మిశ్రా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని, దయాశంకర్‌పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కోర్టుకీడుస్తామన్నారు. మాయాకు జయ బాసట మాయావతిపై బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు సీఎం జయలలిత ఖండించారు. సింగ్ మాటలు ఆయన పార్టీని అప్రతిష్టపాలు చేస్తాయని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల గురించి మాయావతి పార్లమెంటులో లేవనెత్తినందునే సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో మహిళలు తరచుగా ఇలాంటి ‘దాడుల’ను ఎదుర్కొంటున్నారని, తాను కూడా ఇలాంటి చెడు క్షణాలను ఎదుర్కొన్నానని చెప్పారు. కాగా, దయాశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీఎస్పీ గురువారం లక్నోలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. దయాశంకర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం చెప్పింది. దయాశంకర్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఎస్పీ నాయకులు చేసిన ఫిర్యాదుమేరకు లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ 153ఏ, 504, 509 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. -
నోరు జారాడు.. పదవి పోయింది
-
నోరు జారాడు.. పదవి పోయింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్‌పై వేటుపడింది. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్ష పదవి నుంచి దయాశంకర్‌ను తొలగించారు. పార్టీ పదవులన్నింటి నుంచి దయాశంకర్‌ను తొలగిస్తున్నట్టు బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. మాయావతిపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంకావని, వీటిని ఖండిస్తున్నామని మౌర్య చెప్పారు. బుధవారం ఉదయం దయాశంకర్.. మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, కొన్ని గంటల్లోనే బీజేపీ ఆయనపై చర్యలు తీసుకుంది. మాయావతిని వేశ్యతో పోలుస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మూకుమ్మడిగా అధికార బీజేపీని నిలదీశారు. -
బీజేపీ నేత వ్యాఖ్యలపై పెనుదుమారం!
న్యూఢిల్లీ: బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిని ఉద్దేశించి బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ బరితెగింపు వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మాయావతిని వేశ్యతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభను కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మూకుమ్మడిగా అధికార బీజేపీని నిలదీశారు. మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. ఈ విషయంలో మాయావతికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆమె బాధను తాము కూడా పంచుకుంటామని అన్నారు. బీజేపీ నేత దయాశంకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా డిమాండ్ చేశారు. మాయావతి రాజ్యసభలో మాట్లాడుతూ ఈ విషయంలో తనకు అండగా నిలిచిన అరుణ్ జైట్లీ, ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నడూ ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ భావజాలాల పరంగానే ఎవరిపైనైనా విమర్శలు చేశానని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లో దళితులపై అరాచకాల పట్ల రాజ్యసభలో చర్చిస్తున్న సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆమె విమర్శించారు. తనను అందరూ బెహెన్ జీ (అక్కయ్య) అని పిలుస్తారని, తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారం కలిగించిందని ఆమె అన్నారు. ఈ అంశంపై దుమారం నేపథ్యంలో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు యూపీ బీజేపీ చీఫ్ కూడా తమ పార్టీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. -
బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకుల విమర్శలు శృతి మించుతున్నాయి. వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. మాయావతిని వేశ్యతో పోల్చారు. మాయావతి వేశ్య కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని కెమెరా సాక్షిగా నోరు పారేసుకున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో దయాశంకర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ, అమిత్ షా తమ నేతలకు ఇటువంటి మాటలు నేర్పుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాయవతి అన్నారు. గతంలో గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను తీవ్రవాది హఫీజ్ సయీద్ తో పోల్చారు.