భార్య గెలిచింది.. మాఫీ చేసేశారు
మళ్లీ బీజేపీలోకి దయాశంకర్ సింగ్
బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత మొరట వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద నేత దయాశంకర్ సింగ్ తప్పును బీజేపీ మాఫీ చేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ.. మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే.. బీజేపీ ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ గతంలో దయాశంకర్‌సింగ్ హేయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటు లోపలా.. బయటా తీవ్ర దుమారం రేగింది. బీజేపీ సహా అన్ని పార్టీలను ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దళిత నాయకురాలిని ఉద్దేశించి ఇలా మొరటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది. దయాశంకర్‌పై బీజేపీ బహిష్కరణ వేటు వేసినప్పటికీ ఆయన భార్యకు కీలక పదవి అప్పగించింది. ఆమెను యూపీ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది. అంతేకాకుండా ఆమె తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే దయాశంకర్‌పై విధించిన సస్పెన్షన్ వేటును బీజేపీ యూపీ చీఫ్ కేవశ్‌ప్రసాద్ మౌర్య ఎత్తివేశారు. యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తనను తిరిగి పార్టలోకి తీసుకోవడంపై దయాశంకర్ సంతోషం వ్యక్తం చేశారు.