యోగి ఎఫెక్ట్; చేతులు కలపనున్న మాజీ సీఎంలు
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తుండటం, ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో తనదైన శైలిలో దూసుకుపోతుండటంతో.. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి రానున్నాయి. బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఏ పార్టీతోనైనా తాను చేతులు కలిపేందుకు సిద్ధమంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అదినేత్రి మాయావతి ప్రతిపాదించగా.. ఆమెతో చేతులు కలిపేందుకు మరో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముందుకు వచ్చారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమి ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని, కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని అఖిలేష్ చెప్పారు. ప్రజలను మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈవీఎంలను టాంపరింగ్ చేశారన్న మాయావతి వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలుకుతూ, ఎన్నికల సంఘం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని అఖిలేష్ విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
శుక్రవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. బీజేపీయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి అధికారంలోకి రాగా, ఎస్పీ ఓటమి చవిచూసింది. ఇక బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పక్షాలన్ని కూటమిగా ఏర్పడాలని పలు పార్టీల నాయకులు ప్రతిపాదిస్తున్నారు.