‘ఆమె చెబితేనే ఆందోళనలు చేశాం’
లక్నో: బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళనలు చేయించారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు దయాశంకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశామని చెప్పారు.‘మహరాణి(మాయావతి) ఆదేశాల మేరకే అప్పుడు ఆందోళన చేశామ’ని శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
దయాశంకర్ మైనర్ కుమార్తె, భార్య స్వాతిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సిద్ధిఖీపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఈరోజు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. గతేడాది జూలైలో మాయావతిపై దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా బీఎస్పీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. దయాశంకర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 21న హజ్రత్‌గంజ్‌లో సిద్దిఖీ సహా బీఎస్పీ సీనియర్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దయాశంకర్ కుమార్తెకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో దయాశంకర్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఆయన భార్య స్వాతి సింగ్ ఎమ్మెల్యేగా గెలిచి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే దయాశంకర్ కుమార్తెపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కావాలంటే వీడియో క్లిప్పింగులు చూసుకోవచ్చని సిద్ధిఖీ అన్నారు.