Naseemuddin Siddiqui
-
కొత్త పార్టీ పెట్టిన బహిష్కృత నేత
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి బహిష్కరణకు గురైన పార్టీ సీనియర్ నేత నసీముద్దీన్ సిద్దిఖీ కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన సిద్ధిఖీ శనివారం కొత్తపార్టీని ఏర్పాటు చేశారు. తమ పార్టీకి 'రాష్ట్రీయ బహుజన్ మోర్చా' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. మాయావతి సొంత నిర్ణయాల వల్లే 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ దారుణ పరాభవాన్ని చవిచూసిందని సిద్ధిఖీ తీవ్ర ఆరోపణలు చేశారు. మాయావతి ముస్లింలను తప్పుదోవ పట్టించారని, తమ సామాజిక వర్గంపై దారుణ వ్యాఖ్యలు చేశారని పార్టీ అధినేత్రికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో సిద్ధిఖీతో పాటు ఆయన కుమారుడు అఫ్జల్ సిద్ధిఖీని పార్టీ నుంచి రెండు వారాల కిందట బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే సిద్ధిఖీకి కబేళాలున్నాయని, వాటితో పాటు బినామీ ఆస్తులున్నాయన్న కారణంతోనే పార్టీ నుంచి తొలగించినట్లు బీఎస్పీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మాయావతికి కూడా బినామీ ఆస్తులున్నాయని, సమయం వచ్చినప్పుడు నిరూపిస్తానని సిద్ధిఖీ పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్‌ను నియమించారు.అయితే ఎప్పటికీ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు ఆశించరాదని మాయావతి తన సోదరుడికి షరతు విధించిన తర్వాతే కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ సిద్ధిఖీ తన సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని, మాయావతి సొంత విధానాల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. -
‘ఆమె చెబితేనే ఆందోళనలు చేశాం’
లక్నో: బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళనలు చేయించారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు దయాశంకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశామని చెప్పారు.‘మహరాణి(మాయావతి) ఆదేశాల మేరకే అప్పుడు ఆందోళన చేశామ’ని శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాశంకర్ మైనర్ కుమార్తె, భార్య స్వాతిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సిద్ధిఖీపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఈరోజు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. గతేడాది జూలైలో మాయావతిపై దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా బీఎస్పీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. దయాశంకర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 21న హజ్రత్‌గంజ్‌లో సిద్దిఖీ సహా బీఎస్పీ సీనియర్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దయాశంకర్ కుమార్తెకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దయాశంకర్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఆయన భార్య స్వాతి సింగ్ ఎమ్మెల్యేగా గెలిచి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే దయాశంకర్ కుమార్తెపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కావాలంటే వీడియో క్లిప్పింగులు చూసుకోవచ్చని సిద్ధిఖీ అన్నారు. -
మాయావతి బ్లాక్‌మెయిలర్
రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు: సిద్దిఖీ లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి రూ.50 కోట్లు డిమాండ్ చేశారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ ఆరోపించారు. మాయావతి ‘బ్లాక్‌మెయిలర్’ అని విమర్శించారు. తగినన్ని ఆధారాలున్నాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారంగా.. మాయవతితో జరిపిన సంభాషణల ఆడియోను విలేకరుల సమావేశంలో వినిపించారు. తన వద్ద ఇంకా 150 ఆడియో సంభాషణలు ఉన్నాయని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ముస్లింలు బీఎస్పీకి ఓటేయనందుకు వారు నమ్మకద్రోహులంటూ మాయవతి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సిద్దిఖీ బ్లాక్ మెయిలింగ్తో కోట్లు సంపాదించారని తర్వాత మీడియా సమావేశంలో మాయావతి ఆరోపించారు.