'నా భార్య, కూతురు అనారోగ్యంతో ఉన్నారు'
మవు: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీజేపీ బహిష్కృత నాయకుడు దయాశంకర్ సింగ్ ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. మవు జిల్లా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆయనకు పూల దండలు వేసి మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
ఆయనకు ఎస్సీ/ఎస్టీ కోర్టు అదనపు జిల్లా జడ్జి అజయ్ కుమార్ శనివారం బెయిల్ మంజూరు చేశారు. తన భార్య, కుమార్తె ఆరోగ్యం బాలేదని, నేరుగా లక్నోకు వెళుతున్నట్టు దయాశంకర్ తెలిపారు. తన కుటుంబ సభ్యులను కలుసుకుంటానని చెప్పారు. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్ల సమర్పించడంతో ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. సింగ్ పై జూలై 20న కేసు నమోదు కాగా, 29న బిహార్ లో యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, మవు జైలుకు తరలించారు.