
'అతడి నాలుక కోస్తే 50 లక్షలు ఇస్తా'
ఛండీగడ్: మాయవతిపై మొరటు వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై ఉచ్చు బిగుస్తోంది. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి ఆయన కష్టాలు కొనితెచ్చుకున్నారు. బీజేపీ ఆయనను ఆరేళ్ల పాటు బహిష్కరించింది. దయాశంకర్ పై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురువారం పోలీసులు ఉత్తరప్రదేశ్ లో పలుచోట్ల సోదాలు జరిపారు.
మరోవైపు తమ అధినేత్రిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దయాశంకర్ నాలుక కోసి తెచ్చిన వారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ ప్రకటించారు. కాగా, దయాశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనాయకులు విచారం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు చర్యలు తీసుకున్నామని, ఈ వివాదం ముగిసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.