మాయవతిపై మొరటు వ్యాఖ్యలు
♦ ఆమె తీరు వేశ్యకంటే ఘోరమన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు
♦ దయాశంకర్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం
♦ పార్టీలకతీతంగా ఆయన వ్యాఖ్యలను ఖండించిన నేతలు
♦ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్
♦ కమలనాథులపై విరుచుకుపడిన మాయావతి
♦ ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరిక
♦ దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
♦ నోరు జారా.. క్షమించండి.. మాయవతి అంటే నాకు గౌరవం ఉంది: దయాశంకర్
కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం
- దయాశంకర్‌సింగ్
దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయి.
- మాయావతి
న్యూఢిల్లీ/మావు: ‘‘కాన్షీరాం కలలను మాయావతి ఛిద్రం చేస్తున్నారు. రూ. కోటి ఎవరిస్తే వారికే టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరైనా రెండు కోట్లిస్తే.. గంటలోనే ఆ టికెట్ వేరొకరికి సొంతమవుతోంది. సాయంత్రం మరొకరు వచ్చి మూడు కోట్లిస్తానంటే అతనికే టికెట్ ఇచ్చేస్తున్నారు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణం’’అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్.. బీఎస్‌పీ అధినేత్రి, మూడు సార్లు ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయవతిని ఉద్దేశించి సభ్యసమాజం తలదించుకునేలా చేసిన దారుణ వ్యాఖ్యలివీ. ఓ దళిత నాయకురాలిని ఉద్దేశించి చేసిన ఈ హేయమైన వ్యాఖ్యలు పార్లమెంట్ లోపలా.. వెలుపలా ప్రకంపనలు సృష్టిం చాయి. ఒక మహిళా నాయకురాలిని, ఓ పార్టీ అధినేతను పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీలకతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో ఖండించారు. దయాశంకర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ మాయావతి ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ పరిణామాలతో ఇరకాటంలో పడిన బీజేపీ.. తక్షణం దయాశంకర్‌ను పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నిబంధనల ప్రకారం ఆయనపై నిషేధం ఆరేళ్లపాటు ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దళితులకు దగ్గరయ్యేందుకు బీజేపీ విఫలయత్నం చేస్తోంది. ఇటువంటి సమయంలో దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
రాజ్యసభలో దుమారం..
బీజేపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మంగళవారం తొలిసారి మావుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాయావతిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బుధవారం రాజ్యసభలో దుమారం రేగింది. గుజరాత్‌లో దళితులపై అరాచకాల అంశంలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ అంశం సభ ముందుకొచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని లెవనెత్తారు. గౌరవనీయ మహిళా నాయకురాలు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతిపై ఇటువంటి వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. డీఎంకే నాయకురాలు కనిమొళి, టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రయాన్, కాంగ్రెస్ సభ్యులు కుమారి షెల్జా, రేణుకాచౌదరి, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, బీఎస్‌పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రా తదితరులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు క్షమార్షం కానివని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సభ్యులతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ తరఫున ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
సభా నాయకుడు అరుణ్‌జైట్లీ స్పందిస్తూ.. దయాశంకర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని, ఈ అంశంలో మాయావతికి తాము పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. జైట్లీ హామీతో శాంతించని మాయావతి.. దయాశంకర్‌ను పార్టీ నుంచి తొలగించాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు పెట్టుబడిదారీ ఆలోచనా ధోరణికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. తనను అంతా బెహెన్‌జీ (సోదరి)గా భావిస్తారని, అటువంటి తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన కుమార్తె, సోదరికి కూడా వర్తిస్తాయని ధ్వజమెత్తారు. దేశంలో దోపిడీకి, అణచివేతకు గురవుతున్న ప్రజలకు తాను ప్రాతిని ధ్యం వహిస్తున్నానని, వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు. కాన్షీరాం ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెట్టుబడిదారుల నుంచి కాక పేదల నుంచే తాము విరాళాలు స్వీకరిస్తున్నామని వివరించారు.
నోరు జారా.. క్షమించండి..
తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పాటు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోవడంతో దయాశంకర్‌సింగ్ క్షమాపణలు చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చి అగ్రనేతగా ఎదిగిన మాయావతి అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఈ విషయంలో తాను నోరు జారానని పేర్కొన్నారు. అయితే దయాశంకర్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. అటువంటి భాషకు పార్టీలో స్థానం లేదని, ప్రసంగాలు ఇచ్చే సమయంలో నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
కోర్టుకీడుస్తాం: బీఎస్‌పీ ఎంపీ ఎస్‌సీ మిశ్రా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని, దయాశంకర్‌పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆయనను ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కోర్టుకీడుస్తామన్నారు.
మాయాకు జయ బాసట
మాయావతిపై బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు సీఎం జయలలిత ఖండించారు. సింగ్ మాటలు ఆయన పార్టీని అప్రతిష్టపాలు చేస్తాయని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల గురించి మాయావతి పార్లమెంటులో లేవనెత్తినందునే సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో మహిళలు తరచుగా ఇలాంటి ‘దాడుల’ను ఎదుర్కొంటున్నారని, తాను కూడా ఇలాంటి చెడు క్షణాలను ఎదుర్కొన్నానని చెప్పారు. కాగా, దయాశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీఎస్పీ గురువారం లక్నోలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. దయాశంకర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం చెప్పింది. దయాశంకర్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఎస్పీ నాయకులు చేసిన ఫిర్యాదుమేరకు లక్నో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ 153ఏ, 504, 509 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.