ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం | UP Assembly Election 2022: Mayawati Calls For Dalit, Brahmin Unity | Sakshi
Sakshi News home page

ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం

Published Wed, Sep 8 2021 1:48 PM | Last Updated on Wed, Sep 8 2021 1:58 PM

UP Assembly Election 2022: Mayawati Calls For Dalit, Brahmin Unity - Sakshi

ప్రబుద్ధ్‌ వర్గ్‌ విచార్‌ సమ్మేళన్‌లో త్రిశూలంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్‌ వర్గ్‌ విచార్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే  ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్‌)

ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్‌ హితయ్‌.. సర్వజన్‌ సుఖయ్‌’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు.  


కేబినెట్‌లో బ్రాహ్మణులకు సముచిత స్థానం 

గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్‌లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్‌ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు.

ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు.  


ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు.  కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్‌పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్‌ కబీర్‌ నగర్‌ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement