
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ, అసదుద్దీన్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్‌లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్‌పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్‌ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తో ఇటీవల బీఎస్‌పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే.
యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment