దేశంలో ‘తాలిబాన్’ వైఖరి | Opposition slams BJP for 'Taliban-like attitude' towards Dalits | Sakshi
Sakshi News home page

దేశంలో ‘తాలిబాన్’ వైఖరి

Published Fri, Jul 22 2016 12:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

దేశంలో ‘తాలిబాన్’ వైఖరి - Sakshi

దేశంలో ‘తాలిబాన్’ వైఖరి

రాజ్యసభలో కేంద్రంపై ప్రతిపక్షాల ధ్వజం  
దళితులపై దాడులను సహించం: కేంద్రం


‘గో సంరక్షకుల’ను కేంద్రం ఎందుకు నిషేధించదు?: జేడీయూ
‘గుజరాత్ నమూనా’ అసలు రూపం బట్టబయలైంది: కాంగ్రెస్
బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి: సీపీఎం
గుజరాత్ ఘటన నేపథ్యంలో పెద్దల సభలో వాడివేడిగా చర్చ

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో తాలిబాన్ తరహా వైఖరి నెలకొని ఉందంటూ.. దళితులు, ఇతర వర్గాల వారిపై పెరుగుతున్న దాడులపై రాజ్యసభలో ప్రతిపక్షాలు గురువారం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారం చేస్తున్న ‘గుజరాత్ నమూనా’ వెనుక గల అసలు స్వరూపాన్ని దళితులపై దాడి ఘటన బట్టబయలు చేసిందని ధ్వజమెత్తాయి. గుజరాత్‌లో నలుగురు దళిత యువకులను గో సంరక్షకులుగా చెప్పుకుంటున్న వారు బహిరంగంగా కొట్టి హింసించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితుల మీద ఇటీవల జరిగిన దాడులు, ఘటనలపై పెద్దల సభలో చర్చ జరిగింది.  
 
మన కుల వ్యవస్థ తాలిబాన్‌లా ఉంది...
‘‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా దళితులు, ప్రత్యేకించి మహిళలపై దాడులు కొనసాగుతుండటం సిగ్గుచేటు. ఈ ‘గో సంరక్షకుల’ను ఎవరు సృష్టించారు. పెరుగుతున్న నిరుద్యోగిత కారణంగా యువత అటువంటి బృందాల్లో చేరుతున్నారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు గోవులో జీవిస్తున్నారని గుజరాత్‌లో ఈ గో సంరక్షకులు అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను దేశంలో ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్ గురించి మనం మాట్లాడతాం... మన కుల వ్యవస్థకు తాలిబాన్ తర హా వైఖరి ఉంది. దానిపై చర్చించాల్సిన అవసరముంది’’ అని జేడీయూ నేత శరద్‌యాదవ్ చర్చను ప్రారంభిస్తూ విమర్శలు సంధించారు.  
 
‘సబ్‌కా సాథ్’కు పూర్తి విరుద్ధం...
‘‘దళితులు ఆత్మహత్యా యత్నం చేస్తుండటంతో గుజరాత్‌లో పరిస్థితి విస్ఫోటనం చెందేలా ఉంది. అత్యవసర చర్యలు చేపట్టకపోతే  పరిస్థితి విస్ఫోటనమయ్యే ప్రమాదముంది. ఇటీవలి లజ్జాకర ఘటనలు.. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మత ఘర్షణలుగా రూపాంతరం చెందకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలి. మీరు ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ అన్నారు. కానీ పరిస్థితి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. గుజరాత్‌లో వారం కిందట ఘటన జరిగితే సీఎం ఆనందీబెన్‌పటేల్ నిన్ననే (బుధవారం) బాధితులను ఎందుకు కలిశారు?’’ అని కాంగ్రెస్ నేత అహ్మద్‌పటేల్ ధ్వజమెత్తారు.
 
ఛాందసవాదానికి సర్కారు అండ...
‘‘అధికార పార్టీ ఆలోచనా విధానం ఆందోళనకరంగా ఉంది. ఛాందసవాదానికి మద్దతునిస్తోంది. దళితుల దగ్గరకు వచ్చే సరికి మాటల విరేచనాలు.. చేతల మలబద్ధకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. పుంఖానుపుంఖాలుగా ప్రసంగిస్తారు కానీ.. ఏ చర్యలూ లేవు. గత రెండేళ్లుగా నేను చూస్తున్న భారతదేశం నాకు గుర్తున్న భారతదేశం కాదు. గోవును ఇక్కడ పూజిస్తారు. కానీ చనిపోయిన ఆవు చర్మం వలిచిన వారిపై అర్ధరహిత ఆరోపణలు అల్లుతున్నారు. గత ఏడాది దేశంలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో 23 మంది దళితులే. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వం సూచించటం ద్వారా దళితులకు వ్యతిరేకమైన ఒక ఆలోచనావిధానాన్ని సృష్టిస్తున్నారు. 2014లో దళితులపై దాడుల కేసుల సంఖ్య 19 శాతం పెరిగి 47,064కు చేరింది’’ అని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఎండగట్టారు.
 
ఆ ఆలోచనా విధానాన్ని శిక్షించాలి...
‘‘ఒక దళిత విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడల్లా అతడు ఉరి వేసుకోవటానికి ఒక తాడు కూడా సరఫరా చేయండి’ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య లేఖలోని వాక్యాన్ని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రీన్ చదివి వినిపించారు. దళితులపై దాడుల విషయంలో ఆలోచనా విధానంలో సమస్య ఉందని.. ఆ ఆలోచనా విధానాన్ని శిక్షించకుంటే వ్యవస్థ మొత్తం కుళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.
 
మానవత్వంపై మరక: రాజ్‌నాథ్
గుజరాత్‌లో దళితులపై దాడి ఘటన మానవత్వంపై మరక అని, అటువంటి ఘటనలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉద్ఘాటించారు. ఎన్‌డీఏ పాలనలో దళితులపై అత్యాచారాలు పెరిగాయన్న విపక్షం ఆరోపణలను తిరస్కరించారు. సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ.. దళితులపై దాడి ఘటనకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టిందని, 16 మందిని అరెస్ట్ చేయటంతో పాటు.. ఒక ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిందని చెప్పారు.

కేసును ఆరు నెలల్లోగా విచారించటానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు కోసం రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఇటువంటి ఘటనల లెక్కలనూ తాను చెప్పగలనని.. అయితే దానివల్ల ఉపయోగం లేదని, పరిష్కారాల కోసం ఆలోచించాల్సి ఉందన్నారు.
 
అఖిలపక్షం జరపాలి: మాయ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై గో రక్షణ పేరుతో అత్యాచారాలు పెరుగుతున్నాయని.. ఈ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు దళితులపై దాడులు జరుగుతున్న క్రమం కనిపిస్తోం దంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘పార్లమెంటులో చర్చ జరుగుతుంది.

నాయకులు సలహాలిస్తారు. కానీ వాస్తవంలో ఏమీ జరగదు. కేవలం నోటి మాటలే’’ అని విచారం వ్యక్తంచేశారు. బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్‌సింగ్ తనపై అను చిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అధికార పార్టీపై విమర్శల దాడిని మాయావతి రాజ్యసభలో చర్చ సందర్భంగానూ కొనసాగించారు. బీజేపీ ఆ నేతను కేవలం పార్టీ నుంచి బహిష్కరిస్తే సరిపోదని.. ఆయనపై ఆ పార్టీయే స్వయంగా కేసు నమోదు చేసి ఉండాల్సిందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement