
రోహిత్ కుటుంబానికి కేజ్రీవాల్ హామీపై చిక్కులు!
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల సోదరుడికి ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు ఉద్యోగం ఇస్తామంటూ కేజ్రీవాల్ ఇచ్చిన ఈ హామీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
పరిహారం రూపంలో రోహిత్ సోదరుడికి గ్రూప్ సీ ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, ప్రభుత్వ వసతి కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మార్చి 3న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయంలో కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం 'అక్రమం, అరాచకం, రాజకీయ దురుద్దేశపూరితమైన'దంటూ న్యాయవాది అవధ్ కౌషిక్ పిల్ దాఖలు చేశారు.
హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబం విజ్ఞప్తి మేరకు రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఢిల్లి కేబినెట్ నిర్ణయించినట్టు నోటిఫికేషన్‌లో తెలిపారు. కానీ, నిజానికి రోహిత్ కుటుంబం ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞాపన సమర్పించకుండానే.. ఆయన సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది చట్టాలను ఉల్లంఘించి, ప్రభుత్వ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పిల్‌లో న్యాయవాది ఆరోపించారు. ఢిల్లీ కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేయాలని, ఇప్పటికే రోహిత్ సోదరుడికి ఉద్యోగంలోకి తీసుకుంటే ఆ నియామకాన్ని రద్దుచేయాలని హైకోర్టును కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారం కారుణ్య నియామకాలు చేయాలంటే అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.