రూపన్‌ వాలా కమిషన్‌ నివేదికను తిరస్కరించాలి | Reject Roopan Vala report | Sakshi
Sakshi News home page

రూపన్‌ వాలా కమిషన్‌ నివేదికను తిరస్కరించాలి

Published Thu, Aug 24 2017 1:24 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

రూపన్‌ వాలా కమిషన్‌ నివేదికను తిరస్కరించాలి

రూపన్‌ వాలా కమిషన్‌ నివేదికను తిరస్కరించాలి

ప్రజాసంఘాల డిమాండ్‌
►  దోషులను కాపాడేందుకు కుటిలయత్నం
సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రూపన్‌వాలా కమిషన్‌ నివేదికను పార్లమెంటు తిరస్కరించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. దోషులను కాపాడేందుకు బాధితుల వాదనలను వినకుండానే నివేదికను తయారు చేశారని ఆరోపించాయి. కన్సర్న్‌ సిటిజన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రజాసంఘాల తరఫున వక్తలు పాల్గొని ప్రసంగించారు. కమిషన్‌ నివేదికను తిప్పికొట్టాలని విద్యావేత్త చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పిలుపునిచ్చింది. చుక్కారామయ్య మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రోహిత్‌ మరణంపై కమిషన్‌ నిరాధారంగా నివేదికనిచ్చిందని ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు ఆరోపించారు. రెవెన్యూ విభాగం మాత్రమే కులాన్ని ధృవీకరించాలన్న కోర్టు అభిప్రాయాన్ని కమిషన్‌ ధిక్కరించి రోహిత్‌ కులాన్ని నిర్ధారించేందుకు ఎక్కువ ప్రయాసపడిందన్నారు. సెంటర్‌ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ పార్లమెంటులో రూపన్‌వాలా కమిషన్‌ నివేదికను అన్ని రాజకీయపార్టీలు తిరస్కరించాలన్నారు. కొత్తగా మరో కమిటీని నియమించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయ ఒత్తిడితోనే బహిష్కరణ
రోహిత్, ప్రశాంత్‌ సహా మరో ముగ్గురు విద్యార్థుల బహిష్కరణ నిర్ణయం తీసుకున్న ప్రొక్టోరల్‌ కమిటీ లెటర్‌లో ప్రొక్టార్‌ అలోక్‌పాండ్యా సంతకమే ఉందని,   కేవలం రాజకీయ ఒత్తిడితోనే విద్యార్థులపై చర్య తీసుకున్నారని ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. 2015 ఆగస్టు 12న అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్, ఏబీవీపీకి చెందిన వారిని ఘర్షణ విషయమై హెచ్చరించి వదిలేయాలని మాత్రమే ప్రొక్టోరల్‌ కమిటీ నిర్ణయించిందని, కానీ ఆగస్టు 31, 2015 కల్లా విద్యార్థుల బహిష్కరణకు ఎలా దారితీసిందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్‌ 13 నుంచి, నవంబర్‌ 19 వరకు రెండు నెలల కాలంలోనే కేంద్ర మానవ వనరుల శాఖ వర్సిటీకి ఐదు లేఖలు రాయడం, వాటిలో సుశీల్‌ కుమార్‌పై దాడికి ప్రయత్నించారని ప్రస్తావించడం, దానికి కారణాలేంటో కూడా తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ వై.బి.సత్యనారాయణ, ప్రొఫెసర్‌ కె.వై.రత్నం, ఏఎస్‌ఏ కన్వీనర్‌ సన్నంకి మున్నా, సిద్ధోజి, ప్రతీక్, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement