
రోహిత్‌ది హత్యే : ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: రోహిత్ వేములది యూనివర్సిటీ చేసిన హత్యే అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ‘ఆధునిక అసమాన సంస్థాగత హత్యకు రోహిత్ వేముల ఉదాహరణ.. రోహిత్ చట్టం డ్రాఫ్ట్ బిల్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సమ్మయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వర్సిటీల అప్రజాస్వామిక వైఖరి వల్ల వివక్ష పెరుగుతోందన్నారు. అక్కడి వివక్ష, ఎస్సీ విద్యార్థులపట్ల నిర్లక్ష్య వైఖరి కలసే రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిందన్నారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరాడాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వచ్చి రోహిత్ తల్లిని పరామర్శించినా సీఎం కేసీఆర్‌కు మాత్రం అందుకు సమయం దొరకలేదన్నారు. రోహిత్ చట్టం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఓ మేధావి ఈ సమాజంలో నేను బతకలేనని ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి ఒక ప్రమాదఘంటిక లాంటిదని అన్నారు. విమలక్క మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాయడానికి, పాడటానికి కూడా స్వేచ్ఛ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్‌కుమార్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు.