మిస్సైల్ లాంటి కుర్రాడు
► నానో మిస్సైల్ సృష్టికర్త ఒంగోలు యువకుడు
► సక్సెస్ ఫుల్‌గా చెన్నైలో ప్రయోగం
► వరల్డ్ రికార్డ్స్ ఇండియా నుంచి ప్రశంసలు
ఒంగోలు: మినీ మిస్సైల్ సృష్టికర్తగా ఒంగోలు కుర్రోడు క్రెడిట్ కొట్టేయనున్నాడా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేవలం ఒక సెంటీ మీటరు సైజులో మిస్సైల్‌ను తయారు చేసి లక్ష్యాన్ని చేధించగలిగేలా ఇతను చేసిన పరిశోధన నేడు వరల్డ్ రికార్డ్స్ ఇండియా ఏజెన్సీ ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం ఇతని పేరు మార్మోగుతోంది. చిన్నప్పటి నుంచి రాకెట్లపై ఉన్న మోజే ఇతడి మినీ(నానో) మిస్సైల్ పరిశోధనకు కారణమని తెలుస్తోంది.
పరిశోధనలపై ఆసక్తి..
ఒంగోలు కమ్మపాలేనికి చెందిన దాచర్ల తిరుమలరావు పెద్ద కుమారుడైన పాండురంగ రోహిత్‌కు బాల్యం నుంచీ ప్రయోగాలంటే ఆసక్తి చూపేవాడు. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల్లో చదివిన రోహిత్ ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన ఎయిర్‌ఫోర్సు ప్రదర్శనకు హాజరయ్యాడు. ఈ ప్రదర్శనకు కొందరిని ఫ్లయింగ్ క్యాడెట్లుగా ఎంపిక చేశారు. అందులో రోహిత్‌కు అవకాశం దక్కింది. తాను కూడా పైలెట్‌తోపాటు చేసిన ప్రయాణం ఇతనికి అరుదైన అనుభూతిని కలిగించింది. దీంతో ఎలాగైన నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలని తలచాడు. ఎయిర్‌ఫోర్సు చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ తండ్రి కొంత వెనుకంజ వేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంటీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతనికి కొన్ని ఘటనలు కదిలించాయి.
కలచివేసిన దాడి ఘటనలు..
కొన్నేళ్ల క్రితం ముంబైలోని తాజ్‌హోటల్ ఘటన, కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేస్తున్న దాడులు, చత్తీస్‌ఘడ్‌లో ఘటనలు అన్నీ ఇతనిని తీవ్రంగా కలచివేశాయి. ప్రధానంగా శుత్రుదుర్భేధ్యమైన ప్రాంతాలలో చొరబడడం సైన్యానికి కూడా కష్టమైన పనే. ఒక సంపూర్ణమైన సైనికుడ్ని తయారు చేయాలంటే దేశం లక్షలాది రూపాయలు వెచ్చిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుత్రువుల ఒక భవనంలో దాక్కొని చేసే కాల్పులకు సైన్యం ఎంతో కొంత నష్టపోతుంది. ఈ దశలో అతి చిన్న మిస్సైల్‌ను తయారుచేసి దానిని దేశానికి అప్పగించాలనేది ఇతని ఆలోచన. అందులో భాగంగా చిన్నపాటి మెటల్‌ను తీసుకొని అందులో ఎర్ర భాçస్వరాన్ని కూర్చి చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది.
దీనికోసం వరల్డ్ రికార్డ్స్ ఇండియా అనే ఏజెన్సీకి దరఖాస్తు చేయగా వారు అసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో వీడియో తీసి తమకు పంపాలని సూచించారు. అందులో భాగంగా ఇటీవల చెన్నైలోని రామాపురం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సమక్షంలో వీడియో తీసి దానిని ఈ ఏజెన్సీకి పంపారు. వారు దానిని పరిశీలించి సంతృప్తికరం వ్యక్తం చేస్తూ యువకుడ్ని అభినందిస్తూ ఒక ప్రశంసాపత్రాన్ని, మెడల్‌ను ఒంగోలులోని అతని ఇంటికి కొరియర్‌లో పంపారు. తమ కుమారుడికి లభించిన ఖ్యాతిపట్ల తల్లిదండ్రులు తిరుమలరావు, శ్రీదేవి, సోదరుడు వెంకట కృష్ణ రోహిత్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కలాం స్ఫూర్తితో..
నానో మిస్సైల్‌తోపాటు ఒక చిన్న సైజు రోబో కూడా సృషించే ప్రయత్నాల్లో ఉన్నాను. భవనాలలో దాక్కొని, శుత్రు దుర్భేధ్యమైన ప్రాంతాల్లో దాడులు చేసే ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు ఈ రోబో టెక్నాలజీ సాయంతో దాడులు చేయించాలనేది నా యోచన . మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాంత్రికుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని నేను సృష్టించిన ఈ నానో మిస్సైల్ మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు నాందిగా మారుతుందని ఆశిస్తున్నా. – దాచర్ల పాండురంగ రోహిత్