
ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్
ఇండోర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల రాసిన ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తెలిపారు. ‘దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. అతని లేఖ చదివి కన్నీటి పర్యంతమయ్యాను. తన పుట్టుకే ఒక పాపమని, అందుకే ఈ ఆఘాయిత్యానికి ఒడిగడుతున్నానని అతడు రాసిన వాక్యం నా హృదయాన్ని కోతపెట్టింది’ అని అన్నారు.
వరుణ్ మంగళవారమిక్కడ ఓ స్కూల్లో ‘నవ భారత్ కోసం ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో గత ఏడాది ఓ స్కూల్లో చోటుచేసుకున్న వివక్షను కూడా ఆయన ప్రస్తావించారు. ‘మధ్యాహ్న భోజనాన్ని ఓ దళిత మహిళ వండినందుకు స్కూల్లోని 75 శాతం విద్యార్థులు తినేందుకు నిరాకరించారు. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఈ దేశం, ప్రపంచం ఏ దిశగా వెళ్తున్నాయి?’ అని ఆందోళన వ్యక్తం చేశారు.