ఆ రోజు రోహిత్‌ను పరీక్షించాం
హెచ్‌సీయూ వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన రోజున వైద్యులు ఆయన వద్దకు రాకుండా అడ్డుకున్నారని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలతో వర్సిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ విభేదించారు. ఆ రోజు సమాచారం అందిన వెంటనే తాను ఘటనా స్థలానికి వెళ్లి పరీక్షించినట్లు స్పష్టం చేశారు. ‘‘జనవరి 17వ తేదీ రాత్రి 7.20కు రోహిత్ ఆత్మహత్యపై మాకు సమాచారం అందింది. వెంటనే వెళ్లి పరీక్షించాం. అయితే అప్పటికి రెండు గంటల ముందే రోహిత్ చనిపోయినట్లు పరీక్షలో తేలింది.
సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే పరీక్షలు నిర్వహించాం. మేం వెళ్లిన 10 నిమిషాల్లోనే పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు’’ అని ఆమె తెలిపారు. విద్యార్థులు తమను ఎక్కడా అడ్డుకోలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ... రోహిత్ వేముల ఆత్మహత్య సమాచారం అందగానే వైద్యులు హుటాహుటిన వెళ్లి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఎక్కడా నిర్లక్ష్యం జరగలేదని పేర్కొన్నారు. బుధవారం రోహిత్ ఆత్మహత్యపై లోక్‌సభలో జరిగిన చర్చలో స్మృతి మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు రోహిత్ వద్దకు డాక్టర్‌ను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లనివ్వలేదు. మరుసటి రోజు ఉదయం 6.30 గంటల వరకు పోలీసులను కూడా అనుమతించలేదు. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన రోజు అతడిని కాపాడే ప్రయత్నమే జరగలేదని పోలీసులు తెలిపారు. చివరికి ఆయన మృతదేహాన్ని రాజకీయ పరికరంగా వాడుకున్నారు’’ అని అన్నారు.