- రోహిత్ ఆత్మహత్యపై ప్రధాని మోదీ ఆవేదన
లక్నో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై ప్రధాని నరేంద్రమోదీ పెదవి విప్పారు. భరతమాత తన బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కారణాలేవైనా ఒక తల్లి తన కొడుకును పోగొట్టుకుందని, ఆ బాధ తనకు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మోదీ ముర్దాబాద్.. మోదీ గో బ్యాక్.. ఇంక్విలాబ్ జిందాబాద్..’ అంటూ నినదించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్‌పై విడిచిపెట్టారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై మాట్లాడారు.
‘‘నా దేశానికి చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడన్న విషయం తెలియగానే బాధపడ్డాను. భరతమాత ఒక కుమారుడిని కోల్పోయింది. ఆ ఘటన(ఆత్మహత్య)కు కారణాలేవైనా కావొచ్చు.. రాజకీయాలెన్నైనా జరగొచ్చు.. కానీ ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిందన్నది వాస్తవం. ఆ తల్లి పడుతున్న బాధ నాకు తెలుస్తోంది’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ‘‘భారత్ యువదేశం. యువతకు ఎన్నో కలలున్నాయి. అపారమైన యువశక్తి ఉన్నందున 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచం గుర్తిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. అయినా కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘‘అంబేడ్కర్ కలలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకువె ళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. అంబేడ్కర్ ఆశయాలు లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు’’ అని అన్నారు. అనేక కష్టాలు, అవమానాలు ఎదురవుతున్నా ధైర్యంతో ముందుకు వెళ్లిన అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ లక్ష్యం దిశగా సాగాలని సూచించారు. ‘‘ఫిర్యాదులతోనో, దుఃఖంతోనో అంబేడ్కర్ తన సమయాన్ని వృథా చేసుకోలేదు. ఇతరుల నుంచి ఏమీ ఆశించలేదు. కష్టాలు, అవరోధాలను ధైర్యంగా అధిగమించారు. అమెరికా నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి భారతీయ వ్యక్తి అంబేడ్కర్. అయినా ఇక్కడ అణగారిన వర్గాల కోసం పాటుపడేందుకు స్వదేశానికి వచ్చారు. విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ’’ అని మోదీ పేర్కొన్నారు.
దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయిలో ఉండాలన్నారు. ఈ సందర్భంగా తాను ఇటీవల దళిత పారిశ్రామికవేత్తల చాంబర్ సదస్సుకు వెళ్లిన సంగతిని మోదీ గుర్తుచేశారు. అక్కడ దళిత పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. అంబేడ్కర్ కలలు వాస్తవ రూపం దాలుస్తున్నట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు. ఏది తప్పు, ఏది ఒప్పో చెప్పేదే విద్య అని, అది ఈ రోజుల్లో కేవలం పుస్తకాల ద్వారే అందనక్కర్లేదని, ‘గూగుల్ గురువు’ పెద్ద టీచర్‌గా మారిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ కార్యక్రమంలో పట్టాలందుకున్న విద్యార్థులు గతానికి భిన్నంగా దేశీయ సంప్రదాయ దుస్తులైన కుర్తా, పైజామాలు ధరించారు.
దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
లక్నో యూనివర్సిటీకి వచ్చేముందు మోదీ వారణాసిలో పర్యటించారు. వికలాంగులకు అవసరమయ్యే పరికరాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దళితులు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. పేదలు, అణగారిన వరా్గాల ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఆ మార్గం నుంచి పక్కకు తప్పించేందుకు అన్ని వైపుల నుంచి తనను వివాదాల్లోకి లాగేందుకు యత్నిస్తున్నారని, అయినా ఎట్టిపరిస్థితుల్లో ఆ దారిని విడవబోనని చెప్పారు. వ్యవస్థ మారుతున్న సమయంలో, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తున్న సందర్భంలో ఇలాంటివి మామూలేనని వ్యాఖ్యానించారు. పేదలకు సాయం చేయాలన్నదే తన ఏకైక మంత్రమన్నారు.