ఇది దళిత సమస్య కాదు: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు. బుధవారం ఆమె ప్రెస్మీట్లో మాట్లాడుతూ రోహిత్ మృతి విచారకరమంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెచ్సీయూ ఘటనలు దళితులు, దళితేతరుల మధ్య వివాదం కాదని ఆమె అన్నారు. కొంతమంది వాస్తవాలు వక్రీకరించి రెచ్చగొడుతున్నారని స్మృతి వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు. నిజ నిర్ధారణ కమిటీ ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకుంటుందని, కమిటీ సభ్యుల నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీయూ ఘటనలో కేంద్రం జోక్యం లేదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
రోహిత్ సూసైడ్ నోట్లో ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని స్మృతి తెలిపారు. సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు ప్రస్తావించలేదన్నారు. పీహెచ్డీ విద్యార్థుల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు కూడా నిరాకరించిన విషయాన్ని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ కు సంబంధించి పాలకమండలి ఎప్పటికప్పుడు దళిత ప్రొఫెసర్లకు సమాచారం అందించిందని ఆమె తెలిపారు. విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది దళిత వార్డెనే అని స్మృతి చెప్పారు. అలాగే పాలకమండలి సభ్యులందరూ గత ప్రభుత్వంలో నామినేట్ చేసినవారేనని అన్నారు. అలాగే రోహిత్ కుల వివాదంపై విచారణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
హెచ్సీయూ ఘటనలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కూడా లేఖలు రాశారని స్మృతి ఇరాని తెలిపారు. వీహెచ్ లేఖపై స్పందించాలంటూ యూనివర్సిటీకీ 6 సార్లు లేఖలు పంపామని తెలిపిన ఆమె హెచ్ఆర్డీ పంపిన లేఖలపై స్పందించాలా వద్దా అనేది యూనివర్సిటీ విచక్షణాధికారమని స్పష్టం చేశారు.
యూపీఏ హయాంలోనే కేంద్రం తగిన విధంగా స్పందించి ఉంటే రోహిత్ మరణించి ఉండేవాడు కాదేమో అని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వీహెచ్ లేఖల్లోని పలు అంశాలను ప్రస్తావించిన ఆమె హెచ్సీయూలో విద్యార్థుల ఆత్మహత్యలు, భూ కబ్జాలు, నిధుల దుర్వినియోగం, శాంతిభద్రతల సమస్యలు తదితర అంశాలను వీహెచ్ తన లేఖల్లో ప్రస్తావించారని వివరించారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి పరిణామాలు జరుగుతూనే వస్తున్నాయని వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారని గుర్తు చేసిన ఆమె అప్పుడు ఎలాంటి చర్యలు వ్యక్తులు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.