
గాంధీకి జరిగినట్లే రోహిత్‌కూ అవమానం: రాహుల్
దక్షిణాఫ్రికాలో గాంధీజీకి జరిగినట్లే ఇక్కడ రోహిత్‌కు కూడా అవమానం జరిగిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
దక్షిణాఫ్రికాలో గాంధీజీకి జరిగినట్లే ఇక్కడ రోహిత్‌కు కూడా అవమానం జరిగిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణంపై ఉద్యమిస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఒక రోజు నిరశన దీక్ష చేసిన అనంతరం శనివారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ విద్యార్థుల మీద ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఒకే భావజాలాన్ని రుద్దుతున్నారని, దయచేసి అదేంటో బయటకు చెప్పాలని అన్నారు. విద్యార్థులు మీ భావజాలాన్ని ఆమోదిస్తే అది తమకూ ఆమోదమేనన్నారు. విద్యార్థులకు కూడా ఒక డిగ్నిటీ, రెస్పెక్ట్ ఇవ్వాలని కోరారు. మిగిలిన అందరికంటే, తనకంటే కూడా ప్రపంచం అంటే ఏంటో వాళ్లకు బాగా తెలుసని చెప్పారు.
ఇక్కడి సమస్య కేవలం ఒక్క విద్యార్థిది మాత్రమే కాదని, మొత్తం దేశంలోని అన్ని యూనివర్సిటీలలో వివక్ష తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, మతం, కులం.. ఇలా అన్ని రకాలుగా వివక్ష ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మీరు భారతదేశం ముందుకెళ్లాలనుకుంటే, విద్యార్థుల సత్తాను ఉపయోగించుకోవాలని, దేశాన్ని బలోపేతం చేయాలంటే.. సూపర్ పవర్ చేయాలంటే విద్యార్థులను ఎలా ఉపయోగించుకోవాలో చూడాలని ఆయన అన్నారు. రోహిత్‌కు జరిగిన అవమానం ఎవరికైనా జరగొచ్చని, అందుకే తాను ఇక్కడకొచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలిచానని చెప్పారు. సత్యాన్ని నినదించే హక్కును రోహిత్‌కు ఇవ్వలేదని అన్నారు. వివక్షను రూపుమాపేందుకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
కొన్నాళ్ల క్రితం తాను విమానంలో వెళ్తుంటే పక్కన ఓ జపనీయుడు ఉన్నాడని, ఆయన్ను మీరేం చేస్తారని అడిగితే.. ఆటోమొబైల్ పరిశ్రమలో పని చేస్తానన్నారని చెప్పారు. జపాన్‌లో ఇన్నోవేషన్ ఎక్కువ, భారతదేశంలో తక్కువ ఎందుకని అడిగితే.. కుల వ్యవస్థ ఇక్కడ ప్రధాన అడ్డంకి అన్నారని తెలిపారు. పైనుంచి కిందకు సమాచారం రావడానికి చాలా కష్టం అవుతుందని చెప్పారన్నారు.
ప్రధాని మోదీ చెబుతున్న మేకిన్ ఇండియా, కనెక్ట్ ఇండియా లాంటి ఐడియాలు కిందవరకు రావట్లేదని, దిగువ స్థాయిలో వివక్ష చాలా ఎక్కువగా ఉంటోందని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ యువకుడిని జాతివ్యతిరేక శక్తిగా చెబుతున్నారని, ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా భారతీయులంతా దేశాన్ని బలోపేతం చేయాలనే , దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అనుకుంటున్నామని అన్నారు. ఎవరికీ తలవంచని ఆ కుర్రాడి ముందు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.