దళితులపై అత్యాచారాల నిరోధానికి బిల్లు
న్యూఢిల్లీ: దళితులపై అత్యాచారాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని, ఇలాంటి నేరాలను నిరోధించేందుకు వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రాజస్థాన్, మహారాష్ట్రల్లో దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ కాలవ్యవధి మీరిపోయి చెల్లకుండా పోయేలా ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్లిప్తత వహించిందని.. దాని స్థానంలో చట్టం చేసేందుకు ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేలేదని తప్పుపట్టారు. మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ జన్మస్థలమైన మహూను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మంగళవారం సందర్శించనున్న నేపథ్యంలో.. దానికి ఒక రోజు ముందు సోనియా.. ప్రధానికి లేఖ రాయటం గమనార్హం.
సోనియా లేఖ వివరాలు.: రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో భూవివాదం విషయమై 17 మంది దళితులను మరో కులం వారు ట్రాక్టర్‌తో తొక్కించారు. ఈ ఘటనలో నలుగురు దళితులు చనిపోయారు. దీనికి 3 నెలల ముందు అదే జిల్లాలో ముగ్గురు దళితులను సజీవంగా దహనం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. షిర్డీలో మొబైల్ ఫోన్‌కు అంబేడ్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నందుకు దళిత యువకుడిని హత్య చేశారు. ఈ కేసుల్లో దోషులను శిక్షించటం ముఖ్యం. దళితుల సంక్షేమం, రక్షణ బాధ్యతలు నిర్వర్తించే వ్యవస్థను బలోపేతం చేసి, బాధ్యతాయుతం చేయటం దళితుల హక్కుగా న్యాయం పొందేందుకు ముఖ్యం. దీనికోసం యూపీఏ-2 ప్రభుత్వం ఎస్‌సీలు, ఎస్‌టీలు (అత్యాచారాల నిరోధం) చట్టం 1989ని బలోపేతం చేయటంతో పాటు ఇతర చర్యల కోసం ఆర్డినెన్స్ తెచ్చింది’ అని వివరించారు.