ఎంత ప్రయత్నించినా.. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కాంగ్రెస్‌కు చేజార్చుకోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. మరికొద్ది నెలల్లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం భయం. మరో పెద్ద రాష్ట్రమైన రాజస్తాన్‌లో వసుంధర రాజె తదితర ముఖ్య నేతల మధ్య కీచులాటలు. ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇంటి పోరు. వీటన్నింటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ను సమర్థంగా ఢీకొట్టేందుకు అన్ని మార్గాలనూ కమలదళం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ముందస్తుగా ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. తద్వారా ముఖ్య నేతల పరస్పర కుమ్ములాటలను అదుపు చేయడంతో పాటు కీలక సమయంలో వారెవరూ సహాయ నిరాకరణ చేయకుండా చూడవచ్చని భావిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో ఎన్ని క్యాంప్‌లో !
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ... ఇలా సీనియర్లంతా తలో వర్గంగా విడిపోయి కుమ్ములాటల్లో యమా బిజీగా ఉన్నారు. దాంతో కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మానే ప్రధానంగా నమ్ముకుని సాగాల్సిన పరిస్థితి! ఈ పరిస్థితుల్లో చౌహాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం నేతల విభేదాలను చేజేతులా పెంచడమే అవుతుందని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా చూసుకున్నా అది చేటు చేసేదేనని అభిప్రాయపడుతోంది. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి మాటెత్తకుండానే ప్రచార పర్వాన్ని ముగించే పనిలో పడింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికీ బీజేపీకి అతి పెద్ద నేతగా మాజీ సీఎం రమణ్‌సింగ్ ఉన్నా ఆయనపైనా పార్టీలో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మాజీ మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్, ఎమ్మెల్యే అజయ్ చందార్కర్, సీనియర్ నేత నంద్‌కుమార్ సాయ్ లాంటివాళ్లు ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. అసలే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న అంచనాల మధ్య ఈ తలనొప్పులు బీజేపీ అధిష్టానాన్ని మరింత చికాకు పెడుతున్నాయి. అందుకే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరినీ ముందస్తుగా ప్రకటించబోమని బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు.
రాజస్థాన్‌లోనూ రచ్చే
రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధరా రాజె సింధియాకు, సీనియర్ నేతలు అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితరులకు ఉప్పూ నిప్పుగా ఉంటోంది. సింధియా వర్గపు నేత కైలాశ్ మేఘ్వాల్ తాజాగా అర్జున్‌రామ్‌పై విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు. దాంతో అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై వ్యతిరేకత పరాకాష్టకు చేరిందన్నది బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అవినీతి, అమసర్థత తదితర కారణాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తమ నేతల మధ్య పోరు ఇందుకు అడ్డంకిగా మారకూడదని పట్టుదలగా ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు నిత్యం రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతూ వారు కట్టుదాటకుండా చూసే ప్రయత్నాల్లో పడ్డారు.
అయితే ఇలా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల వర్గ పోరును అదుపు చేయడం వంటి ప్రయోజనాలు దక్కే మాటెలా ఉన్నా నష్టాలు జరిగే ఆస్కారమూ ఉందన్న భావన వ్యక్తమవుతోంది. బాధ్యతనంతా భుజాలపై వేసుకుని రాష్ట్ర పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ ఒక్కతాటిపై నడిపే నాయకుడంటూ లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్న అభిప్రాయం బీజేపీలోనే కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టి అంతా అధిష్టానమే అన్నట్టుగా వ్యవహరించి భంగపడ్డ వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment