అతిచిన్న రాష్ట్రం మిజోరంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. దేశంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ మెరుగైన తీరుతో దూసుకుపోతుండగా మిజోరాంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఏ మాత్రం రేసులో లేని నిరాశజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎంఎన్ఎఫ్ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సీట్లలో విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ ఖాయం అయినట్టే.
అయితే ఆరంభంలో కొంచెం జోరుగా ఉన్న కాంగ్రెస్ అంతకంతకూ ఆధిక్యాన్ని కోల్పోతూ తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో అందనంత దూరంలో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు నెట్టేశారు. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో లీడ్‌లో ఉంది. జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్(జేపీఎం) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
వెనుకంజలో సీఎం
స్వయంగా ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనకంజలో ఉన్నారు. సొంత నియోజకవర్గం సెర్చిప్‌లో జీపీఎం అభ్యర్థి లాల్దూ హోమా కంటే వెనుకబడి ఉండగా అటు చంపైలో కూడా వెనుకంజలో ఉన్నారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మిజోరం విజయం చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. అంటే 21 అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment