సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్‌గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్‌లో సత్తా చాటింది. 2019 లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది.
మరోసారి అదే పంథా..
గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు.
ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్‌లో మార్పు..
గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.
రైతులే నిర్ణయించారా..!
సెమీఫైనల్స్‌లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు.
ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment