అంతా రాహుల్‌ వల్లే.. | Congress Says Rahul Gandhi Is The Reason for Winning In Election | Sakshi
Sakshi News home page

2019లోనే అసలు పరీక్ష! 

Published Wed, Dec 12 2018 8:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Says Rahul Gandhi Is The Reason for Winning In Election - Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బీజేపీ పాలిట ముప్పుగా మారారా? 2019 లోక్‌సభ ఎన్నికలనాటికి రాహుల్‌ ప్రాభవం దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబిస్తున్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీతో నువ్వా?నేనా? అన్న రీతిలో తలపడుతోంది. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగడం నాయకుడి లక్షణమనీ, దీన్ని రాహుల్‌ పాటిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో పరిణతి సాధించారని చెబుతున్నారు. 

తప్పుల్ని సరిదిద్దుకున్నారు.. 
ఈ విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.సుశీలా రామస్వామి మాట్లాడుతూ..‘మంచి నాయకుడు అనేవాడు గతంలో తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాడు. ప్రజల సమస్యలను సావధానంగా వింటాడు. ప్రస్తుతం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అదే చేస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు, ఇప్పటి రాహుల్‌కు చాలాతేడా ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మెరుగైన ఫలితాలు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని 65 స్థానాల్లో బీజేపీ 62 సీట్లను గెలుచుకోగలిగింది. మిజోరంతో పాటు తెలంగాణలో ఓటమి పాలైనప్పటికీ రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఈ 3 రాష్ట్రా ల్లో పురోగతి సాధించడం కీలక పరిణామం’ అని వ్యాఖ్యానించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడే మహాకూటమిలో కాంగ్రెస్‌ కీలకంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

విపక్షాల ఏకీకరణతోనే విజయం.. 
రాహుల్‌గాంధీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదనీ, బలవంతంపై, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని సెంటర్‌ ఫర్‌ అడ్వొకసీ అండ్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ మనీషా తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో రాహుల్‌ బాగానే పనిచేసినప్పటికీ అంచనాలను అందుకోలేదు. ఏదేమైనా ఈ ఫలితాలు విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఓ జాతీయస్థాయి నేతగా గ్రామీణ భారతంలోని ప్రజలకు చేరువకావడంలో రాహుల్‌ సఫలీకృతులయ్యారు. మోదీని దీటుగా ఎదుర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్‌ పెట్టేందుకు వీలుగా విపక్షాలను రాహుల్‌ ఎలా కలుపుకుని పోతారన్న దానిపైనే ఆయన సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది’ అని వెల్లడించారు. మోదీ–షా ద్వయం వ్యూహాలకు తిరుగుండదన్న భావన తాజా ఫలితాలతో పటాపంచలు అయ్యాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయానికి రాహుల్‌ తో పాటు ఆయా రాష్ట్రాల నేతలు, కేడర్‌ కూడా కారణమని ఆమె గుర్తుచేశారు. 

అంతా రాహుల్‌ వల్లే: కాంగ్రెస్‌
రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోవడానికి రాహుల్‌ గాంధీ జరిపిన సుడిగాలి పర్యటనలు, రోడ్‌షో లే కారణమని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ ఏకంగా 82 బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఏడు రోడ్‌ షోల్లో పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రైతులు, యువత, సామాన్యుల సమస్యలను, రఫేల్‌ ఒప్పందాన్ని రాహుల్‌ ప్రస్తావించారని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినవెంటనే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న హామీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపిందన్నారు. రాహుల్‌ నిబద్ధత, అంకితభావం కారణంగానే పార్టీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా ఇలాంటి అద్భుత విజ యాన్ని కాంగ్రెస్‌ అందుకుందని ఆ పార్టీ నేత సచిన్‌ పైలెట్‌ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ఫలితాలతో రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ శ్రేణుల నైతిక బలం రెట్టింపు అయిందనీ, మిత్రపక్షాలను ఏకం చేసి బీజేపీని 2019లో ఇంటికి సాగనంపేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement